టెస్టుల్లో రాణిస్తే.. టీ20లకు ఎంపిక చేస్తారా..? గిల్‎ను సెలెక్ట్ చేయడంపై సంజయ్ మంజ్రేకర్ ఫైర్

టెస్టుల్లో రాణిస్తే.. టీ20లకు ఎంపిక చేస్తారా..?  గిల్‎ను సెలెక్ట్ చేయడంపై సంజయ్ మంజ్రేకర్ ఫైర్

ఆసియా కప్ 2025కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లో అద్భుత ఫామ్‎లో ఉన్న శ్రేయస్ అయ్యర్‎ను కాకుండా ఏడాది నుంచి టీ20 జట్టుకు దూరంగా ఉన్న శుభమన్ గిల్‎ను ఎంపిక చేయడమే కాకుండా వైస్ కెప్టెన్సీ కూడా కట్టబెట్టిన బీసీసీఐపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బీసీసీఐ రాజకీయాలకు టాలెంటెడ్ ప్లేయర్లు బలై పోతున్నారని పలువురు మాజీ క్రికెటర్లు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఆసియా కప్‎కు అయ్యర్‎ను పక్కకు పెట్టి గిల్ ఎంపిక చేయడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. బీసీసీఐ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారాయన. టెస్ట్ క్రికెట్ ప్రదర్శనల ఆధారంగా గిల్‎ను టీ20 టోర్నమెంట్‌కు ఎంపిక చేసి.. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తోన్న అయ్యర్‎ను ఆసియా కప్ కు సెలెక్ట్ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘ఒక ఆటగాడిని టెస్ట్ మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా టీ20లకు సెలెక్ట్ చేయడంలో లాజిక్ లేదు. అసలు ఇలా ఎంపిక చేయడంలో అర్థమే లేదు. సెలెక్టర్ల తీరు ఒక ఆటగాడు తన టెస్ట్ మ్యాచ్ ప్రదర్శనలకు టీ20 ప్రతిఫలం పొందుతున్నట్లు ఉంది. ఇది చాలా కాలంగా జరుగుతోంది. ఈ విధానం కరెక్ట్ కాదు’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు సంజయ్ మంజ్రేకర్. 

దేశీయ క్రికెట్‎ను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కారణంతో శ్రేయస్ అయ్యర్‎ను జట్టు నుంచి తప్పించారు. బుద్ధి తెచ్చుకున్న అయ్యర్ ఇంగ్లాండ్‎తో జరిగిన పునరాగమన సిరీస్‎లో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఐపీఎల్‎లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. అయినప్పటికీ ఆసియా కప్‎కు అతడిని ఎంపిక చేయకపోవడం షాకింగ్ విషయమన్నారు. వందల కొద్ది పరుగులు చేసిన ఆసియా కప్‎కు ఎంపిక చేయకుండా బీసీసీఐ అయ్యర్‎కు గిఫ్ట్ ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. 

కాగా, 2025, సెప్టెంబర్ 9 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్‎గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‎గా గిల్ ఎంపికయ్యారు.  ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ సిరీస్, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినా అయ్యర్ ను ఆసియా కప్‎కు ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‎లో కెప్టెన్‎గా తన టీమ్‎ను రన్నరప్‎గా నిలిపిన ఆటగాడిని ఆసియా కప్ కు ఎంపిక చేయకపోవడమేంటని బీసీసీఐపై మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.