సంక్రాంతి అనగానే పిండి వంటలు గుర్తొస్తాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పిండి వంటలు ఫేమస్. వాటిల్లో పాకంతో చేసే వంటలంటే ఏ ప్రాంతం వాళ్లకైనా నోరూరాల్సిందే. సంక్రాంతికి సంతోషంగా ఇంటిల్లిపాది కలిసి చేసే ఈ స్వీట్లలో ఉండే రుచి షాపుల్లో దొరికేవాటిలో ఉంటుందా? అందుకే సంక్రాంతి పిండి వంటలు అంత ఫేమస్. ఈ పండక్కి పాకంతో చేసుకునే మూడు వెరైటీలు ఇక్కడ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
కజ్జికాయలు
కావాల్సినవి : బెల్లం, మైదా, చక్కెర: ఒక్కో కప్పు, పచ్చి కొబ్బరి తురుము: రెండు కప్పులు, యాలకులు: ఐదు, ఉప్పు, నూనె: సరిపడా,
బేకింగ్ సోడా: పావు టీస్పూన్, వేడి నూనె: పావు కప్పు
తయారీ : పాన్లో పచ్చికొబ్బరి తురుము, బెల్లం వేయాలి. బెల్లం కరిగేవరకు కలపాలి. తర్వాత ఒక గిన్నెలో మైదా పిండిని జల్లెడ పట్టాలి. ఆ పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. వేడి నూనె వేసి కలిపాక, నీళ్లు పోసి ముద్దగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. మరో పాన్లో చక్కెర వేసి, నీళ్లు పోయాలి. యాలకుల పొడి వేసి చక్కెర కరిగేవరకు మరిగించాలి. లేత పాకం వచ్చాక మూత పెట్టి చల్లారనివ్వాలి. పిండి ముద్దను ఉండలుగా చేసి చపాతీలా వత్తాలి. కజ్జికాయల చెక్క మీద చపాతీ పెట్టి మధ్యలో కొబ్బరి స్టఫింగ్ పెట్టి నొక్కాలి. అలా తయారుచేసుకున్నవాటిని వేడి నూనెలో వేసి వేగించాలి. వేడి మీదే వాటిని పాకంలో వేసి కాసేపు ఉంచాలి. కజ్జికాయల చెక్క లేకపోతే చేత్తో కూడా చేసుకోవచ్చు.
పాకుండలు
కావాల్సినవి :
నానబెట్టిన బియ్యం : రెండు గ్లాసులు,
బెల్లం: ఒకటిన్నర కప్పు, నెయ్యి: ఒక టీస్పూన్, నూనె, పచ్చికొబ్బరి ముక్కలు: సరిపడా, నువ్వులు: మూడు టీస్పూన్లు
తయారీ : నానబెట్టిన బియ్యాన్ని జల్లెడ పట్టాలి. నీరంతా దిగిపోయాక, బియ్యాన్ని గ్రైండ్ చేయాలి. ఒక పాత్రలో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి. పాకం దగ్గర పడ్డాక జల్లెడ పట్టాలి. నువ్వుల్ని నూనెలేకుండా దోరగా వేగించాలి. పాకంలో నువ్వుల్ని వేసి కలపాలి. తర్వాత అదే పాన్లో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేసి వేగించాలి. వాటిని కూడా పాకంలో వేయాలి. ఆ తర్వాత కాస్త తేమగా ఉండే బియ్యప్పిండిని జల్లెడ పట్టాలి. పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేస్తూ గరిటెతో ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక చేతికి నూనె రాసుకుని వేడి మీదే ఉండలు చేయాలి. వాటిని వేడి నూనెలో వేసి వేగించాలి.
ఇమిర్తి
కావాల్సినవి :
పెసరపప్పు: ముప్పావు కప్పు, మినప్పప్పు: ఒక కప్పు, చక్కెర:నాలుగు కప్పులు, పాలు:అర కప్పు
నూనె: సరిపడా
తయారీ : పెసరపప్పు, మినప్పప్పును శుభ్రంగా కడిగి, విడివిడిగా నానబెట్టాలి. పాన్లో చక్కెర వేసి నీళ్లు పోసి కలపాలి. పాకం తెర్లేటప్పుడు అందులో పాలు పోయాలి. ఆ తర్వాత పాకాన్ని వడకట్టాలి. పాకంలో నెయ్యి వేసి కలపాలి. నానబెట్టిన పప్పులను మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో కాస్త నెయ్యి కూడా వేయాలి. తర్వాత పిండిని క్లాత్లో లేదా కవర్లో వేసి మూటలా కట్టి, కింద చిన్న రంధ్రం పెట్టి నూనెలో చక్రాల్లా వేయాలి. రంగు మారేవరకు వేగాక వాటిని తీసి పాకంలో వేయాలి.
