‘వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా నీరాజనాలు అందుకున్న అలనాటి అందాల నటి మధుబాల జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో మధుబాల పాత్రను పోషించే అవకాశం యంగ్ సెన్సేషన్ సారా అర్జున్‌ను వరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ధురంధర్’ ఫ్రాంచైజీతో బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న సారా.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ‘డార్లింగ్స్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న జస్మీత్ కె రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా గొప్ప విజయాలను అందుకున్నా, వ్యక్తిగత జీవితంలో మధుబాల అనుభవించిన వేదన వర్ణనాతీతం. ఆ భావోద్వేగాలనే ప్రధానాంశంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అలాగే 1950ల కాలం నాటి హిందీ చిత్ర పరిశ్రమ వైభవాన్ని చూపించబోతున్నారు. ఇక మధుబాల క్లాసిక్ లుక్ కోసం ఇప్పటికే సారాకు పలుమార్లు లుక్ టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
