
- మిరుమిట్లు గొల్పుతున్న పుష్కరతీరం
- పుణ్యస్నానాలకు తరలివస్తున్న భక్తులు
మహదేవపూర్/ భూపాలపల్లి రూరల్, వెలుగు : గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 5.44 గంటలకు పుణ్యస్నానాలు మొదలయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చి సరస్వతీ, మేయిన్ ఘాట్ వద్ద స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. పుష్కరాలు నిర్వహించే 12 రోజులపాటు సరస్వతి నవరత్న హారతి పేరుతో గోదావరి హారతిని కాశీ తరహా ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారణాసి నుంచి అషుతోష్ పాండేను ఇందుకోసం ప్రత్యేకంగా ఆహ్వానించగా, ఏడుగురు వేదపండితులు మహాసరస్వతి నవరత్నమాలా హారతి కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు సీఎం రేవంత్‌రెడ్డి, నలుగురు రాష్ర్ట మంత్రులు పాల్గొన్నారు. వారు అంతకుముందు పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా, పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ఆలయాన్ని పూలతో అలంకరించారు. పుష్కరతీరంలో రంగురంగుల లైట్లు మిరుమిట్లు గొల్పతున్నాయి. బస్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ 3 కిలో మీటర్లు కావడంతో ఆర్టీసీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం 43 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. భక్తులకు ఈ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పించారు. ఘాట్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మట్టిపోసి వదిలేయడంతో వాహనాలు వెళ్తుంటే దుమ్ము వస్తుండడంతో నడిచివెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. నీళ్లు చల్లేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.