ఒక్క ఓటు, ఐదేండ్ల భవిష్యత్తు: గ్రామాన్ని ప్రభావితం చేసే సర్పంచ్ ఎన్నిక

ఒక్క ఓటు, ఐదేండ్ల భవిష్యత్తు: గ్రామాన్ని ప్రభావితం చేసే సర్పంచ్ ఎన్నిక

ఎప్పుడు  ఎన్నికలొచ్చినా నోట్లే రాజ్యం ఏలుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు జనం చుట్టూ  నాయకులు తిరుగుతారు. ఎక్కడ  కనిపిస్తే  అక్కడ నమస్తేలు పెడతారు.. మంచిగా నవ్వుతూ మందలిస్తారు..చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు..ఆడిస్తారు. యూత్​ని అయితే మద్యమో.. మరేవో  తాయిలాలు ఇస్తూ మంచి చేసుకుంటారు. ఇవే కదా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జరిగే అద్భుతమైన సన్నివేశాలు! ఇప్పటికే  ఇలాంటి  సీన్స్ గ్రామాల్లో మొదలై ఉంటాయి. 

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి జోరు మీద ఉంది. ఊర్లన్నీ పండుగ వాతావరణంలో ఊగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు రావడంతో పల్లెల్లో సంబురం అలుగులు పారుతోంది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలంతా ఓట్ల వేటలో బిజీ అయ్యారు. పెద్ద పెద్ద లీడర్లు అంతా కులం ఓట్ల లెక్కలు ఎన్నీ, కుల పెద్దలు, మత పెద్దలను వరుసపెట్టి కలుస్తున్నారు. తమవైపు మలుపుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. 

మరోవైపు కొన్ని ఊర్లు మాత్రం ఏకగ్రీవాలకే  జై  కొడుతున్నాయి.  లక్షల్లో డబ్బులు పోసి.. వేలంపాట పాడి మరి గంప గుత్తగా గ్రామాలనే కొనేస్తున్న వార్తలనీ చూస్తున్నాం. ఒక్కో గ్రామంలో ఒక్కో రేటు పలుకుతున్నాయి. ఇదే ప్రస్తుతం మన తెలంగాణలో నడుస్తోన్న రసవత్తరమైన రాజకీయం.

దేశానికే పట్టుకొమ్మలైన పల్లెల తీర్పు ఎలా ఉండబోతోందనే చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. గ్రామీణ ఓటర్లు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది?  అభ్యర్థికి ఏం చూసి ఓటేస్తారు? ఎలాంటి నాయకుడిని.. తమ ఊరి  సర్పంచ్‌‌‌‌గా  ఎన్నుకుంటారు?  అనే చర్చ జోరుగా సాగుతోంది.  సర్పంచ్  ఎన్నికలు వచ్చినప్పుడల్లా నెలరోజులపాటు గ్రామాల్లో పెద్ద పండుగ వాతావరణమే కనిపిస్తుంది. 

ఎన్నికల ప్రణాళికలు,  ప్రచార ఆర్భాటాలు, ప్రత్యర్థుల్ని పడగొట్టేందుకు వ్యూహాలు.. ఇలా చాలా ఉంటాయ్. అసలు ఎన్నికలు అంటే కేవలం తినుడు, తాగుడేనా? ఊరు గురించి ఆలోచించేదేమైనా ఉందా? ఇప్పుడు కూడా.. కులాలు, బలాలు చూసే ఓట్లేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.

 గ్రామాన్ని  ప్రభావితం చేసే ఎన్నిక ఇది!

సర్పంచ్ పదవి అనేది కేవలం ఓ రాజకీయ హోదా కాదు.  గ్రామానికి ప్రథమ పౌరుడి స్థానం, గ్రామాభివృద్ధికి తొలిమెట్టు. ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు తీసుకునే నిర్ణయం చాలా ఆలోచనాత్మకంగా ఉండాల్సిన అవసరం  ఉంది. పంచాయతీ పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు నేరుగా ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తిని  ప్రభావితం చేస్తాయి.  

తాగునీరు,  వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల నిర్మాణం, రోడ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల నిర్మాణ పథకాలు.. ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఈ పనులన్నింటికీ.. నేరుగా సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యత  వహిస్తారు.  మనం ఎన్నుకునే నాయకుడు సమర్థుడైతేనే.. గ్రామ రూపురేఖలు మారతాయి. అసమర్థుడిని ఎన్నుకుంటే.. ఊరితోపాటు మనం కూడా వెనకబడిపోతాం.

ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి?

పార్టీ రంగుల కంటే.. ఊరి అవసరాలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవారికే మద్దతుగా నిలవాలి. పార్టీలకతీతంగా గ్రామానికి మంచి జరిగేలా తీర్పు ఉండాలి. ఇప్పటికిప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనే దానికంటే ముందు..ఊర్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత గురించి మాట్లాడండి. సాధా రణంగా సర్పంచ్ ఎన్నికల్లో.. డబ్బు, మద్యం, బహుమతులు.. ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.  వ్యక్తిగతంగా చేకూరే ప్రయోజనాలు తాత్కాలికం.  

కానీ.. అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుంది. గ్రామం బాగుపడినప్పుడే నాయకులపై, వారి నాయకత్వంపై  ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడుతుంది. గ్రామ అభివృద్ధికి బాటలు పరిచే నాయకత్వం రావాలి.  తమ ఊరిని  మిగతా ఊళ్లకు ఆదర్శంగా మార్చే ఆలోచనలున్న నేతలను ఎన్నుకోవాలి. అధికారం చేతికి అందగానే.. ఊరు మీదపడి బతికేటోళ్లు కాదు. ఊరుని బాగు చేసేవాళ్లు కావాలి. 

పదవిని బాధ్యతగా భావించేవారికే  మద్దతు

సర్పంచ్  ఎన్నికల్లో  పోటీ చేసేవారిలో నిజమైన సేవా దృక్పథం ఉన్నవారిని, పదవిని బాధ్యతగా భావించేవారికే మద్దతు తెలపాలి. ప్రభుత్వ నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగిస్తూ.. ప్రతి పైసా  గ్రామాభివృద్ధి కోసమే ఖర్చు చేసే నాయకుడే కావాలి.  ఊరు తలరాత మారాలంటే.. చైతన్యవంతంగా ఆలోచించాలి.  సర్పంచ్‌‌‌‌గా పోటీ చేసేవారి చరిత్రని పక్కాగా పరిశీలించాలి. గ్రామ సమస్యలపై వారికి అవగాహన ఉందా? గ్రామ సమస్యలపై ఎప్పుడైనా గళం ఎత్తాడా.. పాలకులను ప్రశ్నించాడా? సర్కార్  ఆఫీసుల్లో  పనులు  చేయించే సత్తా ఉందా అనేది కూడా కీలకమే.  

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే పైసలు,  మద్యానికి లొంగిపోతే.. దాని ప్రభావం మాత్రం ఎప్పటిలాగే గ్రామాలపై పడుతుంది.  మనీ, లిక్కర్, బహుమతులు అనేవి కేవలం తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి.  ఆ తర్వాత ఐదేళ్లు ఊరు భవిష్యత్ 
ప్రశ్నార్థకంగా తయారవుతుంది.

ఓటుతో ఊరు రాత మార్చండి!

 మీ  ఒక్క ఓటు విలువ.. మీ కుటుంబం ఐదేళ్ల భవిష్యత్తుతో సమానం.  మీ ఓటుని అమ్ముకుంటే.. మీ ఊరి భవిష్యత్తుని మీరే అమ్మేసినట్లవుతుంది. పంచాయతీ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే యుద్ధాలు కావు. అవి.. ఊరి భవిష్యత్తుని, ప్రజల జీవితాలని పదిలంగా ఉంచడానికి జరిగే ధర్మపోరాటం.  మీ ఓటు.. లూటీ చేసేవారిపై లాఠీ లేపేలా ఉండాలి. ప్రజల కోసమే డ్యూటీ చేసే వారికే  సర్పంచ్ సమరంలో అవకాశం ఇవ్వండి. 

కులం, బలం, వ్యక్తిగత విద్వేషాలను  పక్కనపెట్టి.. కేవలం గ్రామాభివృద్ధి ఏకైక ఎజెండానే ముఖ్యమని ఆలోచించండి. ఊరు స్వరూపాన్ని మార్చే శక్తి మీ చేతిలోనే ఉంది. మీ ఓటుతో.. ఊరు రాతను మార్చుకోండి. డబ్బు ఎర వేసేవారి  మైండ్ బ్లాంక్ అయ్యేలా తీర్పు ఇవ్వండి.  సరికొత్త చరిత్రకు నాంది పలకండి.

- దొడ్డి చంద్రం, కడవెండి