ఐఏఎస్ ఆఫీసర్ పై జిల్లా కలెక్టర్ కు సర్పంచ్ ఫిర్యాదు

ఐఏఎస్ ఆఫీసర్ పై జిల్లా కలెక్టర్ కు సర్పంచ్ ఫిర్యాదు

జగిత్యాల జిల్లా : కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామ సర్పంచ్ తునికి నర్సయ్య .. గతంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ గా పని చేసిన గుగులోతు రవి (ప్రస్తుతం మహబూబ్ నగర్ కలెక్టర్ ) పై ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జిల్లా కలెక్టర్ గా పని చేసిన గుగులోత్ రవి ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా దమ్మయపేట గ్రామంలోని వడ్డరకాలనీలో ఉన్న ప్రైమరీ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని తనకు సూచించారని ఫిర్యాదులో వివరించారు.

150 మీటర్ల పొడవు ఉన్న గోడ నిర్మాణాన్ని పూర్తి చేసిన వెంటనే డబ్బులు అందజేస్తామని కలెక్టర్ తనకు తెలిపాడని వివరించాడు. కానీ, పనులు పూర్తి చేసి మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బిల్లులు రాలేదని, దయచేసి బిల్లులు మంజూరు చేయాలని ఫిర్యాదులో కోరాడు. గ్రామంలో అప్పులు చేసి గోడ నిర్మించామని, సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక గ్రామ సర్పంచ్ గత కలెక్టర్ పై ప్రస్తుత కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.