
- బిల్లులు రాక సర్పంచ్‌ల లొల్లి
- ఒక్కో పంచాయతీకి లక్షల్లో బకాయిలు
- ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సర్పంచ్‌లు
- బిల్లులు క్లియర్ చేయాలని ఇప్పటికే ఎంపీడీవోలకు వినతి
- తాజాగా కలెక్టర్ రాజర్షిషాకుకు మెమోరాండం అందజేత
మెదక్, రామాయంపేట, నిజాంపేట, వెలుగు: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు సతమతం అవుతున్నారు. అధికారులు ఒత్తిడి చేయడంతో అప్పులు చేసిన మరీ పనులు చేశామని, ఏడాదిన్నరగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జీపీ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో ఎస్ఎఫ్సీ, 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రిలీజ్ కాక మెయింటెనెన్స్ కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఫండ్స్, అటు బిల్లులు ఆగిపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట్ మండలాలకు చెందిన సర్పంచ్‌లు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని స్థానిక ఎంపీడీవోలకు వినతి పత్రాలు సమర్పించారు. లేదంటే రిజైన్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం బిల్లులు క్లియర్ చేయించాలని కలెక్టర్ రాజర్షి షాకు మొరపెట్టుకున్నారు.
జిల్లాలో 469 జీపీలు
మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ జీపీల సర్పంచ్ లు అధికార పార్టీకి చెందిన వారే. సీఎం, ఎమ్మెల్యే తమ పార్టీవారే కదా, బిల్లులు టైమ్‌కు వస్తాయని భావించిన వీళ్లు పల్లె ప్రగతి కింద వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టారు. ఒక్కో గ్రామంలో రూ.20 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు బిల్లులు అయ్యాయి. అధికారులు డెడ్‌లైన్లు పెట్టడంతో పనుల కోసం చాలా గ్రామాల సర్పంచులు అప్పులు చేయాల్సి వచ్చింది. అయితే పనులు పూర్తిచేసి ఏడాదిన్నర దాటినా బిల్లులు రిలీజ్ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఇబ్బందిగా మారిన మెయింటెనెన్స్
ప్రభుత్వం జీపీల అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో ఎస్ఎఫ్సీ,15 ఫైనాన్స్ కమిషన్‌తో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ రిలీజ్ కావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు, ట్రాక్టర్‌కు డీజిల్, శానిటేషన్, వీధిదీపాలు తదితర వాటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని సర్పంచులు వాపోతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ పెట్టడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ భర్త శ్రీనివాస్ బిల్లులు ఇవ్వడం లేదని ఒక రోజు అజ్ఞాతంలోకి వెళ్లాడం తెలిసిందే.
కొన్ని జీపీల్లో బకాయిలు ఇలా...
- నిజాంపేట గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.40 లక్షలు రావాలి.
- చల్మెడ గ్రామంలో సీసీ రోడ్లు, మనఊరు - మనబడి కింద చేసిన పనులకు రూ.30 లక్షల పెండింగ్ ఉన్నాయి.
- నందిగామ పంచాయతీకి సీసీ రోడ్డుకు సంబంధించి ఎస్ ఎఫ్ సీ నుంచి రూ.10 లక్షలు రావాల్సి ఉంది.
- నార్లాపూర్ లో సీ సీ రోడ్లు, డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనానికి సంబంధించి రూ.20 లక్షల వరకు బకాయి ఉన్నాయి.
- కె.వెంకటాపూర్ గ్రామంలో నిర్మించిన సీ సీ రోడ్లు, డ్రైనేజీ, తదితర పనులకు సంబంధించి రూ.30 లక్షల బిల్లు పెండిగ్ ఉంది.
- రాంపూర్ గ్రామంలో జీపీ నిధులు రూ.10 లక్షలు, సీసీ రోడ్ల బిల్లు రూ.4 లక్షల రావాల్సి ఉంది. .
రూ.75 లక్షలు పెండింగ్
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు దాదాపు రూ.75 లక్షల బిల్లులు రావాలి. రూ.65 లక్షల వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఉన్నాయి. పనులు పూర్తయ్యి ఏడాదిన్నర కాలం అవుతుంది. అప్పులు తీసుకువచ్చి గ్రామ పనులు చేశాం. వాటికి వడ్డీ పెరిగిపోతోంది. - బి.మహేందర్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులుఏడాదిన్నర అయిపాయేమా గ్రామంలో డ్రైనేజీ లు, సీసీ రోడ్ల నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేశాం. ఇందులో ఎన్ఆర్ఈజీఎస్ నిధులే రూ.30 లక్షల వరకు ఉన్నాయి. పనులు పూర్తయ్యి ఏడాదిన్నర కావస్తుంది. తెచ్చిన అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. మా పదవీ కాలం దగ్గర పడుతోంది. అధికారులు చొరవచూపి పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. -
శివప్రసాద్ రావు, దామరచెరు సర్పంచ్