షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై జరిగిన దాడిని సర్పంచుల సంఘం నేతలు, వివిధ పార్టీల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జిల్లేడు చౌదరిగూడ, ఫరూక్ నగర్, కొత్తూరు మండలాల్లో నిర్వహించిన మీడియా సమావేశాల్లో పలువురు నేతలు మాట్లాడారు.
బందెయ్యపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. బందెయ్యపై కుల వివక్షతో, రాజకీయ కక్షలతో దాడి చేయడం సిగ్గుచేటని జిల్లేడు చౌదరిగూడెం సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్వేతా చంద్రబాబు గౌడ్, జాకారం సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు ఫైరయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి సర్పంచ్ కావడాన్ని ఓర్వలేక కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఫరూక్ నగర్ సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్, చందు నాయక్ మాట్లాడుతూ.. నిందితులతో పాటు దీని వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆయా సమావేశాల్లో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ బందెయ్యకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
- ఇద్దరు అరెస్ట్.. పరారీలో నలుగురు
ఎలుకగూడ గ్రామ సర్పంచ్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో నరసింహులు, యాదయ్యను ఆదివారం అరెస్ట్ చేయగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

