వచ్చే ఐదేళ్లలో ‘సాస్’​ ఇండస్ట్రీ భేష్

వచ్చే ఐదేళ్లలో ‘సాస్’​ ఇండస్ట్రీ భేష్
  • ‘సాస్​’ ఇండస్ట్రీ ఫోకస్​  
  • భారీగా జాబ్స్​ ఇవ్వడానికి రెడీ

బైన్ & కంపెనీ రిపోర్ట్​ ప్రకారం ఇండియా ‘సాస్’​ ఇండస్ట్రీ వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి 20శాతం నుంచి 25శాతం వృద్ధి చెందుతుందని అంచనా. 2027 నాటికి దీని ఏఆర్​ఆర్​ (యాన్యువల్​ రికరింగ్​)లో  35 బిలియన్​డాలర్లకు చేరుకుంటుంది. అందుకే ఈ రంగంలో భారీ గ్రోత్​కు అవకాశాలు ఉన్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. 

న్యూఢిల్లీ: ఇండియన్ సాస్ (సాఫ్ట్​వేర్​ యాజ్​సర్వీస్​) ఇండస్ట్రీలో హెవీవెయిట్​గా పేరున్న జోహో కార్ప్  సీఈఓ శ్రీధర్ వెంబు పోయిన ఏడాది నవంబర్‌‌లో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. తమ ప్రొడక్ట్​ పోర్ట్‌‌ఫోలియోలను మెరుగుపరచడానికి గ్రామాల, చిన్న పట్టణాల ట్యాలెంట్​ కోసం చూస్తున్నట్టు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌‌ వంటి రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వారిని వాడుకోవడం లేదని అన్నారు.  యూపీలోని సోన్‌‌భద్రకు వెళ్లినప్పుడు ఎంతో మంది ట్యాలెంటెడ్​ యూత్​ను కలిశానని శ్రీధర్ చెప్పారు.  సాధారణంగా అయితే ఐటీ కంపెనీలు ఆఫీసుల కోసం టైర్​–1 నగరాలను ఎంచుకుంటాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద నగరాలకు దూరంగా సాస్​ హబ్‌‌ల ఏర్పాటు గురించి సంస్థలు ఆలోచిస్తున్నాయి. జోహోలోనే కాదు.. అనేక సాస్​ సంస్థల్లో కొత్త ట్రెండ్‌‌ ఇది.   ఢిల్లీకి చెందిన వింగిఫై సీఈఓ స్పర్ష్ గుప్తా మాట్లాడుతూ,  “ప్రస్తుతం ఇండియాలోని 65  ప్రాంతాలకు చెందిన  400 మంది మా దగ్గర పనిచేస్తున్నారు. పోయిన సంవత్సరం ఉద్యోగుల సంఖ్య 60శాతం పెరిగింది.  మా ఉద్యోగుల్లో 62శాతం మంది బుల్దానా, తిరువళ్లూరు, కోర్బా, సియోని, లాతూర్ మొదలైన టైర్ 2,  టైర్ 3 ప్రాంతాలకు చెందినవాళ్లే!  వీరిలో 50శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు” అని  గుప్తా చెప్పారు. ట్యాలెంట్​ దొరకడం కష్టంగా మారిందని, కంపెనీలు గ్రామాల, చిన్న పట్టణాల యూత్​కు పెద్ద ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన చెప్పారు.  టైర్​-2 సిటీ కోయంబత్తూరుకు చెందిన మరో సాస్​ కంపెనీ ‘కోవై డాట్​ సీఓ’  సీఈఓ శరవణ కుమార్ మాట్లాడుతూ తాము కూడా  టైర్–2 నగరాలపై ఫోకస్​ చేస్తున్నామని తెలిపారు.  మెట్రోలతో పోల్చినప్పుడు టైర్–-2 నగరాల్లో ఉద్యోగుల లాయల్టీ చాలా మెరుగ్గా ఉందన్నారు. 2014లో ఇంటర్న్‌‌లుగా చేరిన 10 మంది గ్రాడ్యుయేట్‌‌లలో కనీసం 6 మంది ప్రొడక్ట్ లీడ్స్‌‌గా ఎదిగారని వివరించారు. వారంతా ఇప్పటికీ తమతోనే ఉన్నారని అన్నారు. 

గ్రామాలు కీలకం..

చెన్నైకి చెందిన జోహో కార్ప్‌‌లో (మార్కెటింగ్ & కస్టమర్ ఎక్స్​పీరియెన్స్) వైస్​–ప్రెసిడెంట్​ ప్రవల్ సింగ్-  గ్రామాల్లో నియామకాల గురించి మాట్లాడుతూ, "టెక్ ఇండస్ట్రీలో నైపుణ్యాల కొరత తీరట్లేదు.   టెక్నాలజీల అవసరం చాలా రెట్లు పెరుగుతోంది.  ట్యాలెంట్​ను నిర్మించడానికి  అవసరమైన టూల్స్​సిటీల్లో లేవు. అందుకే మేం గ్రామాలవైపు చూస్తున్నాం" అని అన్నారు. ఉత్తర భారతదేశంలో హబ్​ను ప్రారంభించాలనే  ఆలోచన జోహోకు ఉందని అన్నారు. కంపెనీకి ఢిల్లీ, కోల్‌‌కతా, నాగ్‌‌పూర్  పాట్నాలలో  ఆఫీసులు ఉన్నాయని, అక్కడ స్టాఫ్​అవసరమైనప్పుడు  స్థానిక యువతనే నియమించుకుంటామని ఆయన చెప్పారు.   ‘సాస్​భూమి’ రిపోర్ట్​ ప్రకారం, భారతదేశంలోని 77శాతం సాస్​ కంపెనీలకు తమ అతిపెద్ద సవాలు ట్యాలెంట్​ దొరక్కపోవడమే! ఈ కొరత తీరాలంటే రూరల్​ మార్కెట్​కు వెళ్లాలి.  ప్రొడక్టు మేనేజ్మెంట్, ఆర్​&డీ, అమ్మకాలు, మార్కెటింగ్‌‌ విభాగాల్లో రూరల్​ యూత్​ను వాడుకోవచ్చని సాస్​ భూమి సూచించింది.