
హాంకాంగ్: ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి హాంకాంగ్ ఓపెన్‌లో బోణీ చేసింది. మంగళవారం (సెప్టెంబర్ 09) జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ 21–13, 18–21, 21–10తో చియు సియాంగ్ చీహ్–వాంగ్ చి లిన్ (తైవాన్)పై గెలిచారు. 59 నిమిషాల మ్యాచ్‌లో ఇండియా ద్వయం తొలి గేమ్‌లో ఆకట్టుకుంది.
షార్ప్ షాట్స్‌తో చకచకా పాయింట్లు రాబట్టింది. కానీ రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు పుంజుకునే అవకాశం ఇవ్వడంతో మ్యాచ్ డిసైడర్‌కు వెళ్లింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ నెట్ వద్ద ఆధిపత్యం చూపెడుతూ బలమైన స్మాష్‌లతో చెలరేగారు. ఫలితంగా వరుసగా పాయింట్లు రాబట్టి ఈజీగా గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.
మెన్స్ సింగిల్స్‌లో కిరణ్ జార్జ్.. మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. క్వాలిఫయర్స్‌లో వరుసగా 21–14, 21–13తో చియామ్ జూన్ వీ (మలేసియా)పై, 21–18, 21–14తో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్‌పై గెలిచాడు. మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మన్నేపల్లి తరుణ్ 28–26, 21–13తో మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో 21–23, 13–21, 18–21తో జస్టిన్ హోహ్ (మలేసియా) చేతిలో ఓడి మెయిన్ డ్రాకు క్వాలిఫై కాలేకపోయాడు.