బతుకుదెరువుకు సౌదీకి పోయే మనోళ్లకు ఊరట.. 50 ఏండ్ల నాటి కఫాలా రద్దు.. ఎక్కడైనా పని చేసుకునే వెసులుబాటు !

బతుకుదెరువుకు సౌదీకి పోయే మనోళ్లకు ఊరట.. 50 ఏండ్ల నాటి కఫాలా రద్దు.. ఎక్కడైనా పని చేసుకునే వెసులుబాటు !
  • సౌదీలో ‘కఫాలా’ రద్దు.. విదేశీ వలస కార్మికులకు ఊరట..     
  •     పాస్​పోర్టు, ఫోన్లు గుంజుకుని వెట్టి చాకిరీ
  •     బాధితుల్లో సగానికంటే ఎక్కువ మంది ఇండియన్సే
  •     ‘కఫాలా’ రద్దుతో కార్మికులకు స్వేచ్ఛ

    

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికులను నియంత్రించే ‘కఫాలా’ వ్యవస్థను సౌదీ అరేబియా రద్దు చేయడంతో లక్షలాది మందికి స్వేచ్ఛ లభించింది. వీరిలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్​లో 50 ఏండ్లుగా ఈ వ్యవస్థ అమల్లో ఉంది. వలస కార్మికులను కఫీల్ (స్పాన్సర్ లేదా ఓనర్) బంధించి ఉంచుతాడు. కార్మికుల వద్ద నుంచి పాస్​పోర్టు, డబ్బులు, డాక్యుమెంట్లు, ఫోన్​లు గుంజుకుని వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటాడు. 

కఫీల్ ఏం చెప్తే అది చేయాల్సిందే. ఎదురు తిరిగితే దారుణంగా హింసించేవాడు. దేశంలో సదరు కార్మికుడు ఉండాలా? వద్దా? అనేది కూడా ‘కఫీల్ ఫైనల్ చేసేవాడు. గల్ఫ్ దేశాల్లో అమలవుతున్న ఈ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆధునిక బానిసత్వంగా కొన్ని దేశాలు విమర్శించాయి. లేబర్ యూనియన్లు, పలు దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు సౌదీ అరేబియా తలొగ్గి.. కఫాలా వ్యవస్థను రద్దు చేసింది.

‘కఫీల్’ ఏంచెప్తే అదే ఫైనల్

కఫాలా వ్యవస్థ బాధితుల్లో ఎక్కువ మంది ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ కు చెందిన పురుషులు, మహిళలు ఉన్నారు. వీరందరికీ ‘కఫీల్’ చట్టపరమైన గార్డియన్‌‌. కార్మికుడి జీవితంపై పూర్తి అధికారం ఇతనికే ఉంటుంది. ఏం చేయాలన్నా.. కఫీల్ పర్మిషన్ కచ్చితంగా ఉండాల్సిందే. మహిళలతో వ్యభిచారం చేయిస్తారు. 

2016లో కర్నాటకకు చెందిన జసింత మెండోంకా అనే 46 ఏండ్ల నర్సు అడ్డదారిలో ఖతార్​కు వలసవెళ్లింది. అక్కడ ఓ కఫీల్ చేతిలో నరకం అనుభవించింది. ఆమెను రిలీజ్ చేయడానికి కఫీల్ రూ.4.30 లక్షలు డిమాండ్ చేశాడు. దౌత్యపరమైన, లీగల్ యాక్షన్ల తర్వాత ఆమె కఫీల్ చెర నుంచి ప్రాణాలతో బయటపడింది. 2017లో గుజరాత్ కు చెందిన మహిళ కఫీల్ చేతిలో లైంగిక దాడికి గురైంది. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కలగజేసుకుని ఆమెను గుజరాత్​కు తిరిగి తీసుకొచ్చింది.

విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకే.. 

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విమర్శలు, విజన్ 2030 రిఫార్మ్స్​ లో భాగంగా కఫాలా వ్యవస్థను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రద్దు చేశారు. దీంతో 1.35 కోట్ల మంది వలస కార్మికులను (సౌదీ జనాభాలో 42%) ప్రభావితం చేస్తుంది. వీరిలో 25 లక్షల మంది ఇండియన్లు ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన కార్మికులు నిర్మాణ రంగం, ఇండ్లల్లో 
పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

గల్ఫ్ దేశాల్లో 2.50 కోట్ల మంది

గల్ఫ్ దేశాలైన కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్​లో సుమారు 2.50 కోట్ల మంది కార్మికులు కఫీల్ చెప్పు చేతల్లో మగ్గుతున్నారు. అక్కడి ధనవంతుల ఇండ్లల్లో పాచి పని, బిల్డింగ్​ల నిర్మాణాలు, టాయిలెట్లు వాష్ చేయడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. సుమారు 75 లక్షల మంది ఇండియన్లు కఫీల్ బాధితులుగా ఉన్నారు. కఫాలా వ్యవస్థ రద్దయ్యాక కార్మికులందరూ.. తమకు నచ్చిన చోట పనిచేసే అవకాశం దక్కుతుంది. ఎగ్జిట్ వీసా లేకుండానే ఎప్పుడైనా తిరిగి ఇంటికెళ్లే అవకాశం దక్కింది. అన్యాయం జరిగితే లేబర్ కోర్టుల్లో ఫిర్యాదు చేసే హక్కు లభించింది.