చైనాపై 155% టారిఫ్ సబబే.. నేను ఫ్రెండ్లీ రిలేషన్సే కోరుకుంటున్నా.. చైనానే కఠినంగా ఉంది: ట్రంప్

చైనాపై 155% టారిఫ్ సబబే.. నేను ఫ్రెండ్లీ రిలేషన్సే కోరుకుంటున్నా.. చైనానే కఠినంగా ఉంది: ట్రంప్
  • నవంబర్​ 1 నుంచి అమలు చేస్తామని వెల్లడి

న్యూఢిల్లీ/వాషింగ్టన్: చైనా వస్తువులపై 155% టారిఫ్​లు విధించాలన్న విషయంలో తాము ముందుకే వెళ్తున్నామని, నవంబర్ 1 నుంచి ఈ టారిఫ్​లు అమలులోకి వస్తాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్​ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న చైనాపై 155% టారిఫ్​లు వేయడం సరైనదేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల్లో చైనా ఏండ్లుగా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు తమకు కఠిన చర్యలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ‘‘చైనాతో నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.

 కానీ ఆ దేశం ఏండ్లుగా కఠినంగా ఉంటోంది. గత అమెరికన్ ప్రెసిడెంట్లు బిజినెస్ విషయంలో అంత స్మార్ట్​గా ఉండకపోవడం వల్ల చైనా, ఇతర దేశాలు అడ్వాంటేజ్ తీసుకున్నాయి” అని ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియాపై ఇటీవల కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమన్నారు. ఈ డీల్స్​తో అమెరికాకు టారిఫ్​ల రూపంలో లక్షల కోట్ల డాలర్లు వస్తాయని, ఆ డబ్బుతో రుణాల చెల్లింపు కూడా ప్రారంభిస్తామన్నారు. కాగా, రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ట్రంప్ ఇటీవల టారిఫ్​లను పెంచుతామని హెచ్చరించారు.

మోదీతో మాట్లాడా..: ట్రంప్ 

భారత ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం ఫోన్ లో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. ప్రధానంగా ట్రేడ్, ఎనర్జీ రంగాలపై ఎక్కువగా చర్చించుకున్నామని చెప్పారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను పరిమితం చేసుకుంటామని ఈ సందర్భంగా మోదీ తనకు హామీ ఇచ్చారన్నారు. భవిష్యత్తులో రష్యా నుంచి ఇండియా ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొనుగోళ్లు చేయబోదని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు.

 ట్రంప్ మంగళవారం వైట్ హౌస్ లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఓవల్ ఆఫీస్ లో దీపాలను వెలిగించిన ఆయన భారత ప్రజలకు, ఇండియన్ అమెరికన్ లకు ఫెస్టివల్ గ్రీటింగ్స్ తెలిపారు. ‘‘ఈ దీపం చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయానికి సంకేతం” అని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో ఎఫ్​బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, అమెరికాకు ఇండియన్ అంబాసిడర్ వినయ్ క్వాత్రా, ఇండియాకు యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోన్​లో మాట్లాడాను. ప్రధానంగా ట్రేడ్​పై ఎక్కువ చర్చ జరిగింది. మోదీ కూడా దీనిపై ఆసక్తి చూపారు” అని తెలిపారు. 
ఇంతకుముందు 

మాట్లాడుకున్నట్టుగా ఇండియా, పాక్ మధ్య యుద్ధాలు ఉండబోవని ఇది చాలా మంచి విషయమన్నారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని, తనకు మంచి మిత్రుడని.. ఆయనతో తనకు ఏండ్ల అనుబంధం ఉందన్నారు.   

టెర్రరిజంపై కలిసి పోరాడాలి: మోదీ 

దీపావళి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్​కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఉదయం ట్రంప్ ప్రకటన తర్వాత మోదీ ఈమేరకు ట్వీట్ చేశారు. ‘‘నాకు ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రెసిడెంట్ ట్రంప్​కు ధన్యవాదాలు. గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, అమెరికా కలిసి ప్రపంచాన్ని ఆశతో వెలిగించాలని ఈ పర్వదినం సందర్భంగా కోరుకుంటున్నా. 

అలాగే టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా, దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్​తో అమెరికా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ కామెంట్లు చేయడం గమనించదగ్గ విషయం. అయితే, ట్రంప్​తో ఫోన్​లో మాట్లాడినట్టు మోదీ కూడా వెల్లడించినప్పటికీ, వారు ఏయే అంశాలపై మాట్లాడుకున్నారన్న వివరాలను మాత్రం పేర్కొనలేదు.