మేం ఇక్కడున్నామని చెప్పండి.. హమాస్ టెర్రరిస్టులు బంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్

మేం ఇక్కడున్నామని చెప్పండి.. హమాస్ టెర్రరిస్టులు బంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్

జెరూసలెం: ఇజ్రాయెల్​పై దాడి సందర్భంగా హమాస్ మిలిటెంట్లు ఓ ఇజ్రాయెలీ ఫ్యామిలీని బంధించి, వారితో మాట్లాడించేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటికొచ్చింది. మిలిటెంట్లు చిన్నా, పెద్దా, మహిళలు అనే తేడా లేకుండా వందలాది మందిని చంపి శవాల దిబ్బగా మార్చేసిన గాజాకు సమీపంలోని కిబుజ్ గ్రామంలో తీసినట్లుగా భావిస్తున్న ఈ వీడియోను హమాస్ బుధవారం విడుదల చేసింది. ఇందులో ఓ కుటుంబంలోని భర్త, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో కూర్చొని ఉన్నారు. 

మిలిటెంట్లు వారిని గన్స్ తో బెదిరిస్తూ మాట్లాడించేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. ‘‘మీ దేశానికి చెప్పండి. మేం ఇక్కడ ఉన్నామని చెప్పండి” అంటూ అందులో ఆ వ్యక్తిని మిలిటెంట్ ఆదేశించాడు. అతడి కాలుకి బుల్లెట్ గాయం అయిందని ఆ మిలిటెంట్ కెమెరా వైపు చూస్తూ చెప్పాడు. అతడిని ఐడీ కార్డ్ అడగడంతో ఎక్కడుందో వెతకాలంటూ అతడు లేచి కుంటుతూ నడవడం, కాలు నుంచి రక్తం కారుతుండటం వీడియోలో కనిపించింది.