Sayyara: 'సయ్యారా' బాక్సాఫీస్ దూకుడు.. రూ.300 కోట్లు దాటిన రొమాంటిక్ డ్రామా!

Sayyara: 'సయ్యారా' బాక్సాఫీస్ దూకుడు..  రూ.300 కోట్లు దాటిన  రొమాంటిక్ డ్రామా!

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సయ్యారా' ( Saiyaara)  సై అంటోంది.   ప్రపంచ వ్యాప్తంగా జూలై 18న విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా రికార్డులు సృష్టిస్తోంది. పెద్దగా అంచానాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. మౌత్ టాక్ తో 'సయ్యారా' పేరు మార్మోగిపోతోంది. సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 

మోహిత్ సూరి ( Mohit Suri )  దర్శకత్వంలో అహాన్‌ పాండే ( Ahaan Panday ) , అనీత్ పడ్డా ( Aneet Padda )నటించిన 'సయ్యారా' చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  శుక్రవారం ( జూలై 18, 2025 ) విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను భావోద్వేగాలతో ముంచెత్తుతోంది. సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ప్రేక్షకులు థీయేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజు నుంచే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. 

యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన 'సయ్యారా ' ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ సాధించిందని సినీ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ వెల్లడించింది. 8వ రోజు ముగిసే సరికి ఈ చిత్రం దాదాపు రూ. 282 కోట్ల గ్రాస్ ను దాటేసింది. ఇందులో  మన ఇండియా నుంచే సుమారు రూ. 229 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ. 53 కోట్లు రాబట్టింది. ఇక 9వ రోజు అధికారికంగా రూ. 300 కోట్ల మైలు రాయిని దాటింది. విక్కీ కౌశల్ 'చావా' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 808 కోట్ల గ్రాస్ ను సాధించింది. తర్వాత 2025లో ఈ ఘనత సాధించి రెండవ బాలీవుడ్ మూవీగా సయ్యారా నిలిచిందని సినీ ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి. 

ఈ రెండవ వారంతరం దేశీయంగా గ్రాస్ రూ. 85 కోట్లుకు తీసుకెళ్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ లో ఈ వారాంతరం ఈ మూవీ మరో రూ 30 కోట్లు కలెక్షన్స్ వసూళ్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  మొత్తంగా ఈ సెకండ్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ ను ర. 115 కోట్లకు తీసుకెళ్తుందని సినీ ట్రెడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.  సెకండ్ వీకెండ్ ముగిసే సరికి 'సయ్యారా' మొత్తం సుమారు రూ. 365 కోట్ల గ్రాస్ ను రాబట్టనుంది. ఇదే దూకుడు కొనసాగితే మంగళవారం నాటికి 'కబీర్ సింగ్ ' మూవీ గ్రాస్ ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.