ఎస్బీఐ హోమ్ లోన్ల వడ్డీ రేట్ల పెంపు

ఎస్బీఐ హోమ్ లోన్ల వడ్డీ రేట్ల పెంపు

న్యూఢిల్లీ: ఎస్​బీఐ హోమ్​ లోన్లు, సంబంధిత లోన్ల వడ్డీ రేట్లను మార్చింది. ఇక నుంచి సాధారణ హోమ్​ లోన్లపై (టర్మ్ లోన్స్) వడ్డీ 7.50 శాతం నుంచి 8.70 శాతం మధ్య ఉంటుంది. బ్యాంకు వడ్డీ రేట్ల గరిష్ఠ పరిమితిని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇంతకుముందు, హోమ్​లోన్​వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉండేవి.  కనిష్ట పరిమితిలో మార్పు లేదు, కానీ గరిష్ట పరిమితి మాత్రం పెరిగింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ ఆగస్టు ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 5.55 శాతంగా మార్చకుండా స్థిరంగా ఉంచినప్పటికీ, ఎస్​బీఐ తన హోమ్​ లోన్​ రేట్లను పెంచింది.

మ్యాక్స్ గెయిన్ ఓవర్‌‌ డ్రాఫ్ట్ సౌకర్యానికి 7.75 శాతం నుంచి 8.95 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తాయి. టాప్-అప్ లోన్లు కొంత ఖరీదైనవిగా మారాయి. వీటి రేట్లు 8.00 శాతం నుంచి 10.75 శాతం వరకు ఉన్నాయి. ఓవర్‌‌డ్రాఫ్ట్ టాప్-అప్ లోన్లకు 8.25 శాతం నుంచి 9.45 శాతం రేటు వర్తిస్తుంది. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీపై వడ్డీ 9.20 శాతం నుంచి 10.75 శాతం వరకు ఉంటుంది. రివర్స్ మార్ట్‌‌గేజ్ లోన్ల రేటు 10.55 శాతంగా స్థిరంగా ఉంది. యోనో ఇన్‌‌స్టా హోమ్ టాప్-అప్ లోన్ రేటు 8.35 శాతం ఉంటుంది. ఇది మారలేదు. అన్ని హోమ్​ లోన్​ రేట్లు ఎక్స్‌‌టర్నల్ బెంచ్‌‌మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్​ఆర్​)తో ముడిపడి ఉన్నాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఈబీఎల్​ఆర్​ 8.15 శాతంగా ఉంది.