మందకృష్ణతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు

మందకృష్ణతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు
  •     మాదిగ వ్యతిరేక నిర్ణయాలను సహించం
  •     బీజేపీ, బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే..
  •     తెలంగాణ మాదిగ సంఘాల మహా కూటమి

ముషీరాబాద్, వెలుగు: మాదిగ జాతికి వ్యతిరేకంగా ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా సహించబోమని తెలంగాణ మాదిగ సంఘాల మహా కూటమి హెచ్చరించింది. మాదిగలను రాజ్యాధికారం వైపు నడిపిస్తామని చెప్పింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్​పార్టీ మాత్రమేనని స్పష్టం చేసింది. మాదిగలకు న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్​పార్టీని గెలిపించుకుంటామని, ఎస్సీ వర్గీకరణ హామీని నిలబెట్టుకోవాలని కోరింది. సోమవారం సాయంత్రం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మాదిగ సంఘాల మహా కూటమి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా కూటమి కన్వీనర్ పోకల కిరణ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, ఆయన మాదిగ జాతిని తాకట్టు పెట్టి బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికతోపాటు వరంగల్ ఎంపీ స్థానాలను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

 ఈ నెల 18లోపు కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించాలని, లేకుంటే మహా కూటమి తరఫున 17 స్థానాల్లో మాదిగ అభ్యర్థులను నిలబెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి సమన్వయకర్త వశపాక నరసింహ, గ్యార శ్రీనివాస్, రమేశ్​కుమార్, ప్రొఫెసర్ తిరుపతి, ప్రొఫెసర్ నతాన్నియల్, తెలంగాణ మాదిగ సంక్షేమ సమితి అధ్యక్షులు గడ్డ యాదయ్య, జి నరసింహ, మాస్టర్ జి, రాజలింగం, మల్లన్న తదితరులు పాల్గొని మాట్లాడారు.