బిల్లుల ఆమోదానికి గడువు పెట్టొచ్చా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకుసుప్రీం నోటీసులు

బిల్లుల ఆమోదానికి గడువు పెట్టొచ్చా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకుసుప్రీం నోటీసులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకుసుప్రీం నోటీసులు
  • వారంలోగా అభిప్రాయం తెలియజేయాలని ఆదేశం
  • విచారణ ఈ నెల 29కి వాయిదా

న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని గవర్నర్లను, రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించవచ్చా? లేదా? అనే దానిపై స్పష్టత కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాఖలు చేసిన రిఫరెన్స్‌‌పై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పందించింది. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 

సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన బెంచ్ మంగళవారం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కేసును విచారించింది. బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకునే విధానంపై కోర్టులు గడువులు విధించవచ్చా? లేదా? అనే ప్రశ్నను రాష్ట్రపతి రిఫరెన్స్ లేవనెత్తింది. దీనిపై వారంలోగా అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది రాష్ట్రాలతోపాటు కేంద్రానికి సంబంధించిన అంశంగా పరిగణించాలని వ్యాఖ్యానించింది. 

"రాజ్యాంగ వివరణలో సమస్యలు ఉన్నాయి. జులై 29లోగా అభిప్రాయం తెలియజేయాలి" అని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈమెయిల్ ద్వారా అన్ని రాష్ట్రాలకు, స్టాండింగ్ కౌన్సెల్‌లకు నోటీసులు పంపనున్నట్లు కోర్టు తెలిపింది.  అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సహాయం చేయనున్నారు. ఏప్రిల్ 8న తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి రిఫరెన్స్ వచ్చింది. ఇందులో గవర్నర్లు 3 నెలల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రపతికి పంపిన బిల్లులపైనా 3 నెలల్లో నిర్ణయం రావాలని కోర్టు నిర్దేశించింది. ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమా కాదా అనే ప్రశ్నలను రాష్ట్రపతి రిఫరెన్స్ లేవనెత్తింది.