
- ఫ్లాట్ అలాట్‌మెంట్ కోసం బయ్యర్ అగ్రిమెంట్‌నే బిల్డర్ తీసుకోవాలి
- రెరా రిజిస్ట్రేషన్ తేదీని కాదు- సుప్రీంకోర్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఇండ్ల కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. బిల్డర్ – బయ్యర్ అగ్రిమెంట్ తేదీ నుంచే ఫ్లాట్ అలాట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని.. రెరా కింద ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిన తేదీ నుంచి కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చాలా మంది డెవలపర్లు రియల్ ఎస్టేట్(రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్, 2016 కింద రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్ట్ తేదీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనికి సుప్రీంకోర్టు గుడ్‌బై చెప్పింది. ఇండ్ల కొనుగోలుదారులు సుప్రీంకోర్టు ఆర్డర్‌ను స్వాగతించారు. బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్ రైట్స్‌ను సుప్రీంకోర్టు ఈ తీర్పుతో మళ్లీ రీస్టోర్ చేసిందని అన్నారు. రెరా రిజిస్ట్రేషన్ డేట్‌తో డెవలపర్లు ఫ్లాట్స్ హ్యాండ్ఓవర్ లేదా అలాట్‌మెంట్ లింక్ చేయడాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. ఇంపీరియా స్ట్రక్చర్స్ లిమిటెడ్ వర్సస్ అనిల్ పటాని కేసు జడ్జిమెంట్ విషయంలో జస్టిస్ యూయూ లలిత్, వినీత్ సరన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది. ఈ కేసులో బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్ 2013 నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ రెరా కింద 2017 నవంబర్ 17న రిజిస్టర్ అయింది. అగ్రిమెంట్ డేట్ నుంచి 42 నెలల్లో ఈ హౌసింగ్ యూనిట్‌ను ఇండ్ల కొనుగోలుదారులకు ఇవ్వాలి. కానీ అలా చేయలేదు. దీంతో బయ్యర్లు నేషనల్ కన్జూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ)కి వెళ్లారు. ఈ విషయంలో కన్జూమర్ కోర్టు ఇండ్ల కొనుగోలుదారుల వైపు నిలిచి, ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడంలో ఆలస్యం చేసినందుకు బిల్డర్ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై బిల్డర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. రెరా రిజిస్ట్రేషన్ 2020 డిసెంబర్ వరకు వాలిడ్‌లో ఉంటుందని, అంటే ప్రాజెక్ట్ ఆలస్యం కాలేదని వాదించింది. ఈ వాదనను సుప్రీంకోర్టు కొట్టేసింది. రెరా రిజిస్ట్రేషన్‌కు ముందే ప్రాజెక్ట్ అలాట్‌మెంట్ పిరియడ్ ఎక్స్‌పైర్ అయిందని తెలిపింది. బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్ నాటి నుంచే ఫ్లాట్ అలాట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.
రెరా సెక్షన్ 18 కింద ఇండ్ల కొనుగోలుదారులు పొందే ప్రయోజనాన్ని అగ్రిమెంట్ ప్రకారమే లెక్కించాలని, రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రెరా ఉన్నప్పటికీ ఫ్లాట్స్ కట్టి ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఇండ్ల కొనుగోలుదారులు కన్జూమర్ ఫోరమ్‌కు వెళ్లొచ్చని కోర్టు స్పష్టం చేసింది. కన్జూమర్ ప్రొటక్షన్ యాక్ట్ కింద డెవలపర్ల నుంచి రీఫండ్‌ను, పరిహారాలను బయ్యర్లు కోరవచ్చని చెప్పింది. ‘సుప్రీంకోర్టు ఈ విషయంలో క్లారిటీని ఇవ్వడం చాలా మంచి పరిణామం. బిల్డర్– బయ్యర్ అగ్రిమెంట్ ప్రకారమే పరిహారాల చెల్లించమని రెరా అథారిటీలు ఆదేశించవచ్చు. ఈ ఆర్డర్‌తో ఈ అగ్రిమెంట్ రైట్స్ మళ్లీ రీస్టోర్ చేసినట్టయింది’ అని రెరా, సెంట్రల్ అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్, ప్రెసిడెంట్ అభయ్ చెప్పారు.
అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి…
మరోవైపు సొంతంగా హౌస్‌ను కొనుక్కునేటప్పుడు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని, నమ్మి మోసపోవద్దని ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. రీసేల్ ద్వారా ఇంటిని కొంటున్నట్టు అయితే హౌస్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం, పలు ప్రభుత్వ చట్టాల ప్రకారం ప్రూఫ్‌లు పొందడం చేయాలని చెబుతున్నారు. బిల్డర్ లేదా డెవలపర్ నుంచి కాకుండా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా హౌస్ కొనుగోలు చేయడం ఉత్తమమని అంటున్నారు. ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఇంటిని కొంటున్నా.. కన్‌స్ట్రక్షన్ క్వాలిటీని, ప్రాపర్టీ వయసును చెక్ చేసుకోవాలని అన్నారు. అలాట్‌మెంట్ లెటర్‌ను, కన్వేయెన్స్ డీడ్ లేదా సేల్ డీడ్(ప్రాపర్టీకి సంబంధించిన అన్ని రైట్స్‌ను కొనుగోలుదారులకు బదిలీ చేస్తున్నట్టు సెల్లర్ ఇచ్చేది), లీజ్ డీడ్‌ను తీసుకోవాలని చెప్పారు. అలాగే బిల్డర్ లేదా డెవలపర్ నుంచి ప్రాపర్టీని కొనేటప్పుడు కన్వేయెన్స్ డీడ్, సేల్ డీడ్‌ను, యూనిట్ పొందిన లెటర్‌ను, ప్రాపర్టీ పన్ను కట్టిన రసీదులను, ఒకవేళ వర్తిస్తే కొలాబరేషన్ అగ్రిమెంట్, జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ను తీసుకోవాలి. ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పెద్ద బిల్డింగ్స్‌కు), ఎలక్ట్రిసిటీ, సెవరేజ్ డిపార్ట్‌మెంట్‌ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అథారిటీలు జారీ చేసే ప్రాపర్టీ కంప్లీషన్ సర్టిఫికేట్‌ను, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను పొందాలి. ఇలానే ఇండివిడ్యువల్ ఓనర్ల నుంచి హౌస్‌ను కొన్నా కూడా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తెచ్చుకోవాలి.