
న్యూఢిల్లీ: భారతదేశ టాబ్లెట్ పీసీ మార్కెట్ 2025 జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 20 శాతం వృద్ధి సాధించింది. ఈ మార్కెట్‌లో యాపిల్ దాదాపు మూడోవంతు వాటాను దక్కించుకుని మొదటి స్థానంలో నిలిచిందని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రిపోర్ట్ తెలిపింది. యాపిల్ ఐప్యాడ్ సరఫరాలు 2025 జూన్ క్వార్టర్లో గత సంవత్సరం కంటే 10 శాతం పెరిగాయి. కొత్తగా విడుదలైన ఐప్యాడ్ 11 సిరీస్‌కు లభించిన బలమైన డిమాండ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో మెరుగైన లభ్యత కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది. ఈ క్వార్టర్లో యాపిల్ మొత్తం అమ్మకాల్లో 70 శాతం ఐప్యాడ్ 11 సిరీస్‌దే. యాపిల్ తర్వాత శామ్సంగ్ 27 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. దీని సరఫరాలు 15 శాతం పెరిగాయి.
గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ 5జీ మోడల్ ఈ వృద్ధికి ప్రధాన కారణం. లెనోవో మార్కెట్ వాటా 16 శాతంగా స్థిరంగా ఉండగా, సరఫరాలు 18 శాతం పెరిగాయి. షియోమీ, వన్‌ప్లస్ కంపెనీలు వరుసగా 81 శాతం, 95 శాతం వృద్ధిని నమోదు చేసి, 15 శాతం, 6 శాతం మార్కెట్ వాటాను దక్కించుకున్నాయి. విద్యార్థులు, గిగ్ వర్కర్లు వంటి వారి నుంచి వాల్యూ- ఫర్- మనీ టాబ్లెట్లకు మంచి డిమాండ్ ఉందని సీఎంఆర్ సీనియర్ ఎనలిస్ట్ మోనికా కుమారి తెలిపారు. ప్రీమియం విభాగంలో యాపిల్, శామ్సంగ్కు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో టాబ్లెట్ మార్కెట్ 10-–15 శాతం వృద్ధిని సాధిస్తుందని సీఎంఆర్ అంచనా వేసింది. 5జీ టాబ్లెట్లు, వాల్యూ- ఫర్- మనీ ఆండ్రాయిడ్ టాబ్లెట్లకు డిమాండ్ పెరుగుతుందని రిపోర్ట్ పేర్కొంది.