ఇథనాల్​ ఫ్యాక్టరీ కోసం.. రైతుల భూముల కబ్జా!

ఇథనాల్​ ఫ్యాక్టరీ కోసం.. రైతుల భూముల కబ్జా!
  •     సర్కారు భూమిలోని నీటి  వంపులు, నక్షా బాటల ఆక్రమణ
  •     న్యాయం చేయాలంటూ బాధితుల వేడుకోలు

మహబూబ్​నగర్​, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు గత ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్, లావణి పట్టా భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇథనాల్​ కంపెనీ యజమానులు ఏకంగా 22 ఎకరాలను కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిలో ఉన్న పాటు కాల్వలను పూడ్చేసి దిగువన ఉన్న పొలాలకు సాగునీరు వెళ్లకుండా చేశారు. దీనికితోడు కబ్జా చేసిన పొలాల మీదుగా కంపెనీలోకి వెళ్లడానికి నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నారాయణపేట జిల్లా మరికల్​ మండలం చిత్తనూరు గ్రామ శివారులోని సర్వే నంబర్లు 278, 294, 298, 307, 308, 313, 301, 304, 304/ఈ/యూ, 298/ఏ, 299/ఎ/2, 301/ఈతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో 434 ఎకరాల భూమి ఉంది. ఇందులో హెటిరో అధినేత పార్థసారథి రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మోహన్​రావు దొడ్డ కలిసి ఇథనాల్​కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు స్లీపింగ్​ పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. 2022 జనవరిలో వీటి పనులు స్టార్ట్​ చేయగా దాదాపు పూర్తి కావస్తున్నాయి. అయితే మెయిన్​ రోడ్డు నుంచి కంపెనీలోకి రాకపోకలు సాగించడానికి.. లారీలు పార్కింగ్​ చేయడానికి ఇతర అవసరాల కోసం దాదాపు 25 ఎకరాల భూమి అవసరం ఉంది. చుట్టూ ప్రైవేట్​ భూమి లేకపోవడంతో కంపెనీ యజమానులు అక్రమాలకు పాల్పడ్డారు. 1980లో ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 25 మంది రైతులకు సర్వే నంబర్​213లో ఉన్న భూములను పంచారు. ఇందులో కొందరికి ఎకరా, ఎకరన్నర భూములు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములు ఇథనాల్​ కంపెనీకి ముందు భాగంలో ఉన్నాయి. దీంతో కంపెనీ యజమానులు ఈ భూములపై కన్నేశారు. 12 మంది రైతులకు చెందిన 22 ఎకరాలను కబ్జా చేశారు. ఈ భూముల మీదుగా దాదాపు అర కిలోమీటర్​ వరకు నాలుగు లేన్ల సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు అడ్డు వస్తోందని పొలాలకు వెళ్లే పాటు కాల్వను పూడ్చేశారు.

పాటు కాల్వలు.. నక్ష బాటల కబ్జా

కంపెనీ నిర్మాణంలో యజమానులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిన్నారం నుంచి లంకాల వెళ్లే కిలోమీటరున్నర నక్షా బాటను, ఎక్లాస్​పూర్​ నుంచి చిత్తనూరు వెళ్లే రెండు కిలోమీటర్ల నక్షా రోడ్డును కబ్జా చేశారు. ఎన్కటి కాలం నుంచి ఉన్న 20 ఫీట్ల పానాది బాట(ప్రభుత్వ భూమి)ను ఆక్రమించుకున్నారు. ఉందేకోడ్, చిత్తనూరు, ఎక్లాస్​పూర్ ​నుంచి వర్షాధారంగా వచ్చే గౌనికుంట వంపును దారి మళ్లించారు. ఈ వంపు ద్వారా వరద మన్నేవాగులోకి చేరి దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ, ఈ వంపును కంపెనీ వద్ద కబ్జా చేసి పూడ్చేశారు.

మూడు నెలలకు ముందే ఇసుక డంపులు

ఇథనాల్​ కంపెనీ రావడానికి మూడు నెలలకు ముందే 2021 నవంబరు, డిసెంబరు నెలల్లో భారీగా ఇసుక డంపులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్​రెడ్డి, సుంకిని రాజేందర్​రెడ్డి వారి అనుచరులతో మాగనూరు, కోయిల్​కొండ, రాకొండ, సంగంబండ, బండ్రవల్లి, జిన్నారం, గూరకొండ ప్రాంతాల్లోని వాగుల నుంచి రోజూ టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో కంపెనీ వద్ద ఇసుకను నిల్వ చేశారు. ప్రజలు, రైతులు అడ్డుకుంటారనే అనుమానంతో ఓ ఎమ్మెల్యే ఏకంగా ఇసుక టిప్పర్లకు ఎస్కార్ట్​గా వచ్చేవారని గ్రామస్థులు చెప్పారు. ఇలా దాదాపు రెండు వేల ట్రిప్పుల ఇసుకను కంపెనీ నిర్మాణం కోసం తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. అయితే కంపెనీ అవసరాల కోసం తమ భూములను ఆక్రమించడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. ఆఫీసర్లు, లీడర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

కనుక్కుని చెప్తా

నేను నెల కిందటే ఈ మండలానికి తహసీల్దార్​గా వచ్చా. అక్కడి ఫ్యాక్టరీ గురించి నాకు తెల్వదు. ప్రభుత్వ భూమి కబ్జా చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అన్ని వివరాలు కనుక్కొని చెబుతా. ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటా.
- రాంకోటి, తహసీల్దార్​, మరికల్​

ఈయన పేరు ఊషన్న. చిత్తనూరు గ్రామంలో ఎకరా అసైన్డ్​ భూమి ఉంది. ఏటా పత్తి పంటను సాగు చేసేటోడు. నిరుడు సీజన్​లో పంట సాగు కోసం పట్టాదారు పాసుబుక్కు పెట్టి జిన్నారం ఏపీజీవీబీలో రూ.35 వేల లోన్ ​తీసుకున్నాడు. ఈ సారి పంట సాగుకు రెడీ కాగా, కంపెనీ కోసమంటూ ఈయన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో నాలుగు లేన్ల సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఊషన్న తనకు న్యాయం చేయాలని ఆర్డీవోకు కంప్లైంట్​ చేసినా.. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

చిత్తనూరు గ్రామానికి చెందిన కటికె ఫాతిమా బేగంకు 1.2 ‌ఎకరాల సీలింగ్​ పట్టా భూమి ఉంది. ఏటా పత్తి పంట సాగు చేసేవాళ్లు. రెండేళ్ల కిందట భర్త హుస్సేన్​ కాలం చేయడంతో ఫాతిమా వ్యవసాయం మానేసింది. భూమిని గ్రామానికి చెందిన ఓ రైతుకు కౌలుకు ఇచ్చింది. ఇటీవల ఈ భూమిని కంపెనీ కోసమని తీసుకున్నారు. కొంత భూమిలో రోడ్డు కూడా వేశారు. దీంతో ఉన్న భూమిని లాక్కొని తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.