
పిల్లలు చనిపోవడానికి, కులానికీ సంబంధం ఉందా? ఆస్ట్రియా సంస్థ చేసిన ఓ స్టడీ చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీ కులాల్లోని పిల్లలే ఎక్కువగా చనిపోతున్నారని ఈ సంస్థ అంటోంది. పేదరికం కావచ్చు, చదువుకోకపోవడం కావచ్చు, ఏదైనా ఎస్సీ, ఎస్టీ వర్గాల వాళ్ల పిల్లలు ఐదేళ్లలోపే బలైపోతున్నారన్నది ఈ సర్వే చెబుతున్న విషయం. ఇండియాలో ఐదేళ్లలోపు పిల్లల మరణాల సంఖ్య కొన్నేళ్లుగా తగ్గింది. కానీ, ఎస్సీ, ఎస్టీల్లో మాత్రం ఐదో పుట్టిన రోజు లోపు చనిపోతున్న పిల్లల సంఖ్య మాత్రం ఇంకా ఎక్కువగానే ఉందని ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనలాసిస్ (ఐఐఏఎస్ఏ) అనే సంస్థ వెల్లడించింది. ఇండియాలో కులాలకు, ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2015–16లో నిర్వహించిన ఇండియన్ డెమోగ్రఫిక్ హెల్త్ సర్వే ఫలితాలను విశ్లేషించిన ఐఐఏఎస్ఏ వరల్డ్ పాపులేషన్ ప్రోగ్రాం రీసెర్చ్ అసిస్టెంట్జయంత బోరా బృందం ఈ చేదు నిజాలను బయటపెట్టింది.
ఎస్సీ, ఎస్టీల్లోనే మరణాలు ఎక్కువ
దేశంలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా చనిపోతున్న కొన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను వాళ్లు స్టడీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కాకుండా ఇతర కులాల్లోని ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు ప్రతి1000కి 46.6గా ఉన్నట్టు తేలింది. ఎస్సీల్లో 55.8, ఎస్టీల్లో 57.2 మంది చనిపోతున్నట్టు గుర్తించారు. దీంతో ఇతర కులాల వారితో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ కులాల్లోనే ఐదేళ్లలోపు పిల్లల మరణాలు ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. కుల అసమానతలు, మహిళలు పెద్దగా చదువుకోకపోవడం, పేదరికం వంటి కారణాల వల్ల వారికి సరైన వైద్యం అందడం లేదని, అందుకే ఆయా కులాల్లోని పిల్లలే ఎక్కువగా చనిపోతున్నారని రీసెర్చర్లు పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులకు మధ్య సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు వారి స్టడీలో తేలింది. ఎస్సీ, ఎస్టీ పిల్లల మరణాల్లో ఆ రాష్ట్రమే మొదటిస్థానంలో ఉందని రీసెర్చర్లు వెల్లడించారు. బీహార్లో ఇతర కులాలకు చెందిన పిల్లల్లో ప్రతి 1000కి 54 మంది చనిపోతున్నారు. ఎస్సీల్లో 72.9 మంది, ఎస్టీల్లో 52.5 మంది చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2005లో నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్(ఎన్హెచ్ఆర్ఎం) ప్రారంభించిన తర్వాత కులానికి, ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు మధ్య సంబంధం చెరిగిపోతోందా? లేదా? అన్నది కూడా తాము పరిశీలించినట్టు జయంత బోరా తెలిపారు. అయితే, మహిళల్లో చదువుకోకపోవడం, కుటుంబ సంపాదన తక్కువగా ఉండటం అనేవి ఇంకా ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని గుర్తించామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా హెల్త్‌కేర్, గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలు, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు వంటి అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెస్తేనే ఐదేళ్లలోపు పిల్లల మరణాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని జయంత పేర్కొన్నారు. లేకపోతే మార్పు ఉండదన్నారు.