నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఎంఈవోలు, స్కూల్‌కాంప్లెక్స్, హైస్కూల్ హెచ్ఎంలు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు భద్రత కల్పించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన క్లాస్‌రూమ్స్ తొలగించాలని, వంట గదులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రెండు రోజులుగా జిల్లాలో పలు పాఠశాలలో పర్యటించి గుర్తించిన సమస్యలను పరిష్కరించి నివేదికలు అందజేయాలని ఎంఈవోలను ఆదేశించారు. టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
