3 ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసిన చిచ్చర పిడుగులు

3 ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసిన చిచ్చర పిడుగులు

పిల్లలు కాదు.. పిడుగులు అని నిరూపించారు లక్నోకు చెందిన నలుగురు స్కూల్ విద్యార్థులు. ఆడి పాడే వయసులోనూ అనుకున్నది సాధించగలం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ టీంకు ‘ఫోర్ ఎవర్’ అని పేరు పెట్టుకున్న ఆ నలుగురు, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు 3 ఈవీ కార్లను తయారుచేశారు. ఈ కార్లు పొల్యూషన్ ఫ్రీ నే కాకుండా గాలిని శుభ్రపరుస్తుండటం విశేషం. 

11 ఏండ్ల విరాజ్ మెహ్రోత్రా, 9 ఏండ్ల ఆర్యవ్ మెహ్రోత్రా, 12 ఏండ్ల గర్విత్ సింగ్,14 ఏండ్ల శ్రేయాన్ష్ మెహ్రోత్రా లక్నోలోని మిలీనియం స్కూల్లో చదువుతున్నారు. ఎలన్ మస్క్ టెస్లా నుంచి స్పూర్తి పొంది ఈవీ కార్లను తయారుచేయాలి అనుకున్నారట. వాళ్ల ఆలోచనకు రోబోటిక్ నిపుణుడు మిలింద్ రాజ్ గైడెన్స్ తోడైంది. డస్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్ తో పనిచేసే ఈ కార్లు ధ్వని కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనం నడుపుతున్నప్పుడు గాలిని కూడా శుభ్రపరుస్తాయి. 

కార్ల తయారీకి రీసైకిల్డ్ మెటీరియల్ వాడారు. ఆధునిక డిజైన్, బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్ తో, 1,800W బ్యాటరీ సామర్థాన్ని కలిగి ఉన్నాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 5జీ టెక్నాలజీతో పనిచేసే ఈ కార్లను ఈ నలుగురు కలిసి కేవలం 250 రోజుల్లోనే తయారుచేశారు. వాటిలో ఒకటి 3 సీటర్, ఒకటి 2 సీటర్, మరొకటి సింగిల్ సీటర్ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం లెడ్ యాసిడ్ బ్యాటరీతో నడుస్తున్న వీటిని త్వరలోనే లిథియం బ్యాటరీగా మారుస్తామని చెప్పున్నారు. ఈ మూడు కార్లను తయారుచేయడానికి 5 లక్షల వరకు ఖర్చయిందట.