బద్లాపూర్ అమానుషం: కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. షాకింగ్ వీడియోలు బయటకి..

బద్లాపూర్ అమానుషం: కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. షాకింగ్ వీడియోలు బయటకి..

బద్లాపూర్: మహారాష్ట్రలోని బద్లాపూర్లో స్కూల్లో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై నిరసనకారులు భగ్గుమన్నారు. ఆ స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిరసనకారులు పాఠశాలపై రాళ్లు రువ్వి, లోపలికి ప్రవేశించి స్కూల్ ప్రాపర్టీని పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. దీంతో.. చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసనగా చేసిన ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారింది. వందల మంది నిరసనకారులు స్కూల్ దగ్గరకు చొచ్చుకెళ్లారు.

 

నిరసనకారులు స్కూల్ను తగలబెట్టే ప్రయత్నం చేశారు. స్పాట్లో కిరోసిన్ దొరికింది. స్కూల్ను తగలబెట్టడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బద్లాపూర్లో స్కూ్ల్ విధ్వంస దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆందోళనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో.. మరిన్ని పోలీసు బలగాలు స్కూల్ దగ్గరకు చేరుకున్నాయి. బద్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. వేల సంఖ్యలో నిరసనకారులు రైల్వే ట్రాక్స్ మీదకు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనల్లో భాగం కావడం గమనార్హం.

 

బద్లాపూర్లోని స్కూ్ల్లో చదువుకుంటున్న మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై అదే స్కూల్లో పనిచేసే స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారులను గర్ల్స్ టాయ్లెట్కు తీసుకెళ్లి నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆగస్ట్ 17న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత అమానుషానికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని, ఉరి తీసేంత వరకూ ఊరుకునే ప్రసక్తే లేదని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్ను ఏర్పాటు చేశామని, బాధ్యులను వదిలిపెట్టే సమస్యే లేదని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చెప్పారు.