ఈ రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

ఈ రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

భారీ వర్షాల మధ్య చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే కొద్ది రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెలవు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఢిల్లీలో 1982 నుండి జూలైలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఆరు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జూలై 10 నుంచి జూలై 16 మధ్య అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేయబడతాయని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

హర్యానాలోని గురుగ్రామ్‌లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూలై 10న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు, కార్పొరేట్ కంపెనీలకు కూడా ఇంటి నుండి పని చేయాలని సూచించింది.  

పంజాబ్‌లోని పాటియాలా, మొహాలి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  సట్లెజ్, సావన్ నదులు ఉప్పొంగుతున్నాయి. ఆనకట్ట తెగిపోవడంతో మొహాలి, పాటియాలలోని కొన్ని గ్రామాల్లోకి నీరు చేరింది. మొహాలీ, పాటియాలా జిల్లాల పాలనా యంత్రాంగం అన్ని పాఠశాలలకు సెలవులను ఆదేశించింది.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి. అనేక నదులపై నిర్మించిన వంతెనలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కులు-మనాలి మధ్య కొన్ని చోట్ల కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో అక్కడి, రాష్ట్ర ప్రభుత్వం2023  జూలై 11 వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది.