ఎల్లుండి నుంచే స్కూళ్లు

ఎల్లుండి నుంచే స్కూళ్లు

ప్రింట్ కాని బైలింగ్విల్ బుక్స్
కొత్తగా 15వేల బడుల్లో ఇంగ్లీష్
20వేల దాకా టీచర్ పోస్టులు ఖాళీ 
ఇంగ్లిష్​ మీడియంతో మరింత కొరత

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఈసారీ తిప్పలు తప్పేలా లేవు. ఎల్లుండి నుంచే స్కూల్స్​ రీ ఓపెన్​ అవుతున్నాయి. అదే రోజు పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి. కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీనికితోడు బడుల్లో సరిపడా టీచర్లు లేరు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం రోజు ఉత్త చేతులతోనే పిల్లలు బడిబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ‘మనఊరు మనబడి’ ప్రోగ్రామ్​తో స్కూల్స్​లో ప్రభుత్వం ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తోంది. ముందు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్ తో పాటు టీచర్ల భర్తీ లాంటివి పట్టించుకోకుండా, కేవలం ఇన్​ఫ్రాస్ర్టక్చర్​పై దృష్టి పెడితే ఉపయోగం ఏంటని టీచర్లు, పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.

23 లక్షల మంది స్టూడెంట్స్​
రాష్ట్రంలో 26,072 సర్కారు బడులున్నాయ్​. వీటిలో దాదాపు 23 లక్షల మంది పిల్లలు చదువుతున్నరు. 3వ తేదీ నుంచే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా అడ్మిషన్లు జరుగుతున్నయ్. సమ్మర్ హాలిడేస్​ 12వ తేదీతో ముగుస్తున్నాయి. 13న బడుల తలుపులు తెరుచుకోనున్నాయి. అయితే ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్​లుగానీ రాలేవ్​. ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లలకు అందించే సెల్స్​ బుక్స్ వర్క్ ఆర్డర్ రెండ్రోజుల కిందటే పబ్లిషర్స్​కు ఇవ్వడంతో అవి మార్కెట్​లోకి రావాలంటే టైంపడుతుంది. అప్పటిదాకా పుస్తకాల్లేకుండానే బడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ నెలాఖరు వరకూ బ్రిడ్జికోర్సు నిర్వహించాలనే ఆలోచనలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉన్నారు. పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ ఆలస్యంగా అందడానికి స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని టీచర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. టెండర్ల ప్రక్రియను కావాలనే ఆలస్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పుస్తకాలు అందుడు లేట్​ అయితది.. 
ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి దాకా ఇంగ్లిష్ మీడియం క్లాసులు షురూ చేస్తున్రు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాలను రెండు భాగాలు చేసి ఇస్తున్నారు. దీంతో 8వ క్లాస్ వరకూ బైలింగ్విల్ బుక్స్​ను ప్రింట్ చేయిస్తున్నారు. స్టేట్​వైడ్ గా ఫస్ట్ పార్ట్ లో మొత్తం 2 కోట్ల ఉచిత పుస్తకాలు అవసరం. ఇప్పటికీ 40 లక్షల పుస్తకాలే జిల్లాలకు చేరాయి. ఈ నెలాఖరు దాకా కోటి పుస్తకాలను చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నరు. అన్ని పుస్తకాలు ప్రింట్ చేయాలంటే కనీసం ఇంకోనెల నుంచి నెలన్నర  టైమ్ పడ్తది. అక్టోబర్​నాటికి సెకండ్ పార్ట్ పుస్తకాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో జిల్లా కేంద్రాల నుంచి స్కూల్ పాయింట్లకు పుస్తకాలు పంపినందుకు అయిన చార్జీలు ఇప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు ఇవ్వలేదని డీఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీవీలు లేరు.. కొత్తోళ్లనూ తీసుకోలే.. 
రాష్ట్రంలో 10,704 బడుల్లో ఇంగ్లిష్​ మీడియం తరగతులు నడుస్తున్నయ్​. ఫ్రెష్​గా ఇంకో 15,368 స్కూళ్లలో ఇంగ్లిష్​ మీడియం స్టార్ట్ చేస్తున్నరు. 1,500 బడుల్లో 10 స్టూడెంట్స్​లోపే అడ్మిషన్లు ఉండగా, మిగిలిన స్కూళ్లలో పిల్లల్లేరు. రాష్ట్రంలో మొత్తం 1,03,911 మంది టీచర్లుండగా, వారిలో 60,604 మంది టీచర్లు ఇంగ్లిష్​ మీడియం కొనసాగుతున్న బడుల్లో పాఠాలు చెప్తున్నారు. మరో 43,307 మంది తెలుగు, ఇతర మీడియం టీచర్లు. రెండేండ్ల కింద టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న దగ్గర 16 వేల మంది విద్యావాలంటీర్లను రిక్రూట్​ చేసుకున్నరు. ఈ రెండేండ్ల కాలంలో చాలామంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. ఈ లెక్కన సుమారు 20 వేల ఖాళీలు ఏర్పడ్డాయి. 2021–22 అకాడమిక్ ఇయర్​లో ప్రైవేటు స్కూళ్ల నుంచి రెండున్నర లక్షల మంది పిల్లలు సర్కారు బడుల్లో చేరారు. ఇలాంటి టైమ్​లో కొత్త టీచర్లను తీసుకోకుంటే.. పాఠాలు ఎవరు చెప్తరనేది ప్రశ్నార్థకంగా మారింది. సింగిల్​ మీడియం ఉన్న స్కూల్స్​లో ఇంగ్లీష్​ మీడియా ప్రారంభం అయితున్నది. ఇక్కడ ఉన్న టీచర్లు, ఎవరికి పాఠాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ కూడా ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలె. ఉన్న టీచర్లతోనే రెండు సెక్షన్స్​కు పాఠాలు చెప్పించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది. 

వీవీలను నియమించాలె..  
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టడంతో పేరెంట్స్​ నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇలాంటి టైమ్​లో టీచర్లు లేరని తెలిస్తే.. అడ్మిషన్లు వెనక్కి పోతాయి. వారిని కాపాడుకునేందుకు వెంటనే సబ్జెక్టు ఖాళీల్లో విద్యావాలంటీర్లను నియమించాలి. పుస్తకాలు, యూనిఫామ్​లు వీలైనంత జల్దీ పిల్లలకు అందించాలి. బడుల్లో స్వచ్ఛ కార్మికులనూ నియమించాలె. 
- రాజభాను చంద్రప్రకాశ్, హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

4 జతల యూనిఫామ్ ఇవ్వాలె
పేద పిల్లలకు ఇవ్వాల్సిన యూనిఫామ్​ను నిరుడు ఇవ్వలే. కేంద్రం నుంచి నిధులు తీసుకున్నరు కాబట్టి ఈసారి గతేడాదితో కలిపి 4 జతల యూనిఫామ్ ఇవ్వాలి. ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభించబోతున్నా, బడుల్లో సరిపడా టీచర్లు లేరు. టీచర్లకు ఇచ్చిన ఇంగ్లిష్ ట్రైనింగ్​ కూడా పిల్లలకు, టీచర్లకు ఉపయోగపడేలా లేదు. - సదానందంగౌడ్, టీఎస్​ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు