స్కాట్లాండ్‌‌ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌‌

స్కాట్లాండ్‌‌ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌‌

హోబర్ట్‌‌:  టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం. తొలి రోజు మాజీ చాంపియన్ శ్రీలంకకు నమీబియా షాకిస్తే.. ఇప్పుడు రెండుసార్లు వరల్డ్‌‌ విన్నర్‌‌ వెస్టిండీస్‌‌ను స్కాట్లాండ్‌‌ చిత్తు చేసింది. రికార్డు స్థాయిలో రెండు వరల్డ్‌‌ కప్స్‌‌ నెగ్గి ఇప్పుడు క్వాలిఫయింగ్‌‌ పోటీలు ఆడే స్థాయికి దిగజారిన కరీబియన్‌‌ టీమ్‌‌   సోమవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో  స్కాట్లాండ్‌‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 160/5 స్కోరు చేసింది.  ఓపెనర్‌‌ జార్జ్ మన్సీ (53 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 66) చెలరేగగా, మెక్‌‌ లియోడ్‌‌ (23),  మైకేల్‌‌ జోన్స్‌‌ (20) రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌లో ఏ దశలోనూ పోటీ ఇవ్వని విండీస్‌‌ 18.3 ఓవర్లలో 118  రన్స్‌‌ కే కుప్పకూలింది.  స్కాటిష్‌‌ బౌలర్లు మార్క్‌‌ వాట్‌‌ (3/12), మైకేల్‌‌ లీస్క్‌‌ (2/15), బ్రాడ్‌‌ వీల్‌‌ (2/32) దెబ్బకు కరీబియన్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు.  ఓపెనర్లు మేయర్స్‌‌ (20), ఎవిన్‌‌ లూయిస్‌‌ (14), బ్రెండన్‌‌ (17)  ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్‌‌ పూరన్‌‌(5), బ్రూక్స్‌‌ (4), పావెల్‌‌ (5) ఫెయిలయ్యారు. మధ్యలో హోల్డర్‌‌  (38) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.  మన్సీ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. 

ఐర్లాండ్‌‌పై జింబాబ్వే గెలుపు

మరో గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో జింబాబ్వే  31 రన్స్‌‌ తేడాతో ఐర్లాండ్‌‌ను ఓడించింది. తొలుత సికిందర్‌‌ రజా (82) మెరుపులతో జింబాబ్వే 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన ఐరిష్‌‌ టీమ్‌‌ 143/9 మాత్రమే చేసి ఓడింది