అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీకి మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై వినోద్ అదానీ నియంత్రణ కలిగి ఉన్నారనేందుకు తగిన సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విచారణను సెబీ క్లోజ్ చేసింది.
సాక్ష్యాలు లేవన్న సెబీ..
సోమవారం విడుదల చేసిన 81 పేజీల ఫైనల్ ఉత్తర్వులో సెబీ ఈ కీలక విషయాన్ని వెల్లడించింది. ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్స్, ఈఎం రెసార్జెంట్ ఫండ్ అనే రెండు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థలలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్లో వినోద్ అదానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు తమకు లభించలేదని సెబీ వెల్లడించింది.
కేవలం వ్యాపార, ఆర్థిక సంబంధాలు ఉన్నంత మాత్రాన వినోద్ అదానీ ఆ సంస్థల పెట్టుబడులను నియంత్రించినట్లు భావించలేమని సెబీ చెప్పింది. పాలసీ నిర్ణయాలను నిర్దేశిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే 'డిఫ్యాక్టో కంట్రోల్' కింద పరిగణించాల్సి ఉంటుందని, ఇక్కడ అలాంటిది నిరూపించబడలేదని సెబీ స్పష్టం చేసింది. నాసర్ అలీ షబాన్ అహ్లీ, చాంగ్ చుంగ్-లింగ్ ద్వారా వినోద్ అదానీ నియంత్రణ సాధించారన్న వాదనలను కూడా రెగ్యులేటర్ తోసిపుచ్చింది.
కొన్ని సంస్థలపై జరిమానా..
అయితే సరైన సమాచారాన్ని అందించడంలో విఫలమైన నాసర్ అలీ షబాన్ అహ్లీ, చాంగ్ చుంగ్-లింగ్ ఇద్దరిపై సెబీ రూ.20 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇదే నోటీసులో పేర్కొన్న మిగిలిన 18 సంస్థలు ఇప్పటికే సెటిల్మెంట్ ఫీజును చెల్లించి సెబీ విచారణ నుంచి బయటపడ్డాయి. అలాగే ఒపాల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ పెట్టుబడులపై కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని సెబీ స్పష్టం చేసింది.
FPIలు, ఒపాల్ సంస్థలపై సమర్థవంతమైన నియంత్రణను సెబీ నిరూపించలేకపోవడంతో రూ.1,984 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించారన్న ఆరోపణలు నిలవలేకపోయాయి. ఫలితంగా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) వైలేషన్స్ సహా PFUTP నిబంధనల కింద మోపిన అనుబంధ ఆరోపణలన్నీ కొట్టేయబడ్డాయి. ఈ తీర్పుతో అదానీ గ్రూప్‌నకు.. ముఖ్యంగా వినోద్ అదానీకి ఊరట లభించింది. మెుత్తానికి ఇటీవలి కాలంలో అదానీపై ఉన్న కేసులను దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా కొట్టేస్తూ ఆయన వ్యాపారాలకు లైన్ క్లియర్ చేస్తున్నాయి.
