
- దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విక్టరీపై భారత్ కన్ను
- మ్యాచ్ కు వాన ముప్పు
జొహన్నెస్‌బర్గ్: బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికాతో ఇండియా క్రికెటర్లు బాక్సింగ్ ఆడుకున్నరు. అటు బ్యాట్, ఇటు బాల్‌తో హోమ్‌టీమ్ ప్లేయర్లకు పంచ్ ఇచ్చారు. సౌతాఫ్రికా కంచుకోట అయిన సెంచూరియన్ స్టేడియంలో సూపర్ విక్టరీతో బోణీ కొట్టారు. ఇప్పుడు సఫారీల గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచి చర్రిత సృష్టించే అద్భుత అవకాశం కండ్ల ముందు కనిపిస్తుండగా.. సోమవారం నుంచి జరిగే రెండో టెస్టులో కోహ్లీసేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్లేయర్లంతా ఫుల్‌జోష్‌లో ఉండగా.. న్యూ ఇయర్‌ను హిస్టారికల్ విక్టరీతో స్టార్ట్ చేయాలని చూస్తోంది. పైగా, ఈ మ్యాచ్ జరిగే వాండరర్స్ క్రికెట్ స్టేడియం ఫారిన్‌లో ఇండియాకు కంచుకోట.ఈ గ్రౌండ్‌లో మనోళ్లు ఇప్పటిదాకా ఒక్క టెస్టులో కూడా ఓడిపోలేదు. 2018లో ఇదే గ్రౌండ్‌లో టెస్టు గెలిచిన కోహ్లీసేన తర్వాత ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు సిరీస్ నెగ్గి, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లోనూ సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు మళ్లీ వాండరర్స్‌లో అడుగు పెట్టింది. సవాల్ విసిరే సెంచూరియన్ గ్రౌండ్‌లో హోమ్‌టీమ్‌ను చిత్తుగా ఓడించడంతో ఇండియా ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ డబులైంది. ప్రస్తుతం మన ప్లేయర్లంతా జోరు మీదున్నారు. పేస్ బౌలర్లకైతే ఎదురేలేదు. మరోవైపు ఫస్ట్ టెస్టులో ఓటమితో సఫారీ టీమ్ డీలా పడ్డది. పలువురు వెటరన్ క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా వీక్ అయింది. పైగా, కీపర్ డికాక్ సడెన్ రిటైర్మెంట్ ఆ టీమ్‌కు మరో దెబ్బ. కాబట్టి రెయిన్‌బో నేషన్‌లో సిరీస్ గెలిచేందుకు ఇండియాకు ఇదే గోల్డెన్ చాన్స్. అయితే, ఈ టెస్టుకు వాన ముప్పు ఉంది. ఐదు రోజుల్లో నాలుగు రోజులు వాన వచ్చే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్.
కెప్టెన్ కోహ్లీ కొట్టాల్సిందే..
తొలి టెస్టులో ఘన విజయం వచ్చినప్పటికీ.. ఇండియా టీమ్‌లో కొన్ని బలహీనతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానె ఫెయిల్యూర్ కొనసాగుతోంది. సెంచూరియన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రాహుల్ సెంచరీ, మయాంక్ ఫిఫ్టీతో పాటు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్ చేయడంతో ఇండియా గెలిచింది గానీ లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. పుజారా, కోహ్లీ సెంచరీ లేకుండానే రెండేండ్లు ముగించారు. రహానె వంద మార్కు అందుకొని ఏడాది అయిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 0,6తో ఫెయిలైన పుజారాతో పాటు రహానెపై ఇప్పుడు ప్రెజర్ ఉంది. టీమ్‌లో ప్లేస్ కోసం శ్రేయస్, విహారి నుంచి పోటీ ఉండటంతో వెంటనే ట్రాక్‌లో పడకపోతే ఈ ఇద్దరూ టీమ్‌కు దూరం కాక తప్పదు.
మరోవైపు కోహ్లీ రెండేళ్ల నుంచి బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. 2014 మాదిరిగా తరచూ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు ఔటవుతున్నాడు. ఈ వీక్‌నెస్ నుంచి ఎంత త్వరగా బయటపడితే తనకు అంత మంచిది. తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలు ఆగాలంటే తనలోని సూపర్ బ్యాటర్‌ను ఇప్పటికైనా నిద్రలేపి.. దంచికొట్టాల్సిందే. ఫామ్‌లో ఉన్న లోకేశ్, మయాంక్‌తోపాటు లాస్ట్ మ్యాచ్‌లో ఫెయిలైన పంత్ కూడా చెలరేగితే ఇండియాకు ఎదురుండదు. బౌలింగ్‌లో మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు. షమీ, బుమ్రా, సిరాజ్‌తో పాటు శార్దూల్, ఉమేశ్, ఇషాంత్ రూపంలో ఈ జనరేషన్‌లోనే బెస్ట్ అనిపించే పేస్ యూనిట్ మన సొంతం. మన పేస్ పవర్ వల్లే ఆసీస్, ఇంగ్లండ్‌లో విక్టరీలు వచ్చాయి. కెప్టెన్ కోహ్లీ విన్నింగ్ కాంబినేషన్‌ను ఎక్కువగా మార్చడు. అయితే, వాండరర్స్ వికెట్‌కు సూటయ్యే ఉమేశ్‌ను శార్దూల్ ప్లేస్‌లో తీసుకొచ్చే చాన్సుంది. అలాగే ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే విహారి టీమ్‌లోకి రావొచ్చు.
ఇబ్బందుల్లో సఫారీలు..
ఫస్ట్ టెస్టులో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా టీమ్ గ్రౌండ్ లోపల, బయట ఇబ్బందులు పడుతోంది. బ్యాటింగ్‌లో ఆ టీమ్ చాలా వీక్‌గా ఉంది. ఎల్గర్, బవూమ తప్పితే మరే బ్యాటర్ బాధ్యతగా ఆడటం లేదు. దీనికితోడు సెంచూరియన్‌లో ఓటమి తర్వాత కీపర్ డికాక్ రిటైర్మెంట్ ఇవ్వడంతో టీమ్ మరింత వీక్ అయ్యింది. డికాక్ ప్లేస్‌లో కైల్ వెరేన్ కీపర్‌గా రానున్నాడు. గాయం నుంచి కోలుకున్న పేసర్ ఒలీవర్ రాకతో సఫారీ పేస్ ఎటాక్ ఇంకాస్త బలంగా మారనుంది.
మొదటి టెస్టులో ఫస్ట్ డే తేలిపోయిన తర్వాత హోమ్‌టీమ్ పేసర్లు ఎంగిడి, రబాడతో పాటు యంగ్‌స్టర్ జాన్సెన్ బాగానే బౌలింగ్ చేశారు. కానీ, బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్లే ఆ జట్టు ఓడింది. కాబట్టి బ్యాటింగ్‌లో మెప్పిస్తేనే ఇండియాకు సఫారీలు పోటీ ఇచ్చి సిరీస్‌లో నిలవగలదు. అయితే, తమ కంచుకోటలాంటి సెంచూరియన్‌లోనే తేలిపోయిన సఫారీలు చెత్త రికార్డు ఉన్న వాండరర్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.