
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్ లో కొంతమంది ఉన్నతాధికారులు మిడిల్- లెవెల్ ఆఫీసర్లను వేధిస్తున్నారని తెలంగాణ సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్, జనరల్ సెక్రటరీ లింగమూర్తి ఇతరులు సీఎస్ రామకృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. కొంతమంది ఉన్నతాధికారులు తమను దుర్భాషలాడుతున్నారని.. ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని మిడిల్-లెవెల్ ఆఫీసర్లు తమ ఫిర్యాదులో తెలిపారు.
వేధింపుల కారణంగా కొంతమంది మిడిల్-లెవెల్ ఆఫీసర్లు స్వచ్ఛంద పదవీ విరమణకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. అంతేకాకుండా, కొన్ని డిపార్ట్‌మెంట్లలో మిడిల్ -లెవెల్ ఆఫీసర్లను సరైన కారణం లేకుండానే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కు సరెండర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది వారి వృత్తి జీవితంపై , పరిపాలనా సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అసోసియేషన్ నేతలు తెలిపారు. ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు.