లోక్‌సభలో జరిగిన ఘటనపై విచారణ జరిపే బాధ్యత నాది : ఓంబిర్లా

లోక్‌సభలో జరిగిన ఘటనపై విచారణ జరిపే బాధ్యత నాది : ఓంబిర్లా

పార్లమెంటులోకి ఇద్దరు  అగంతకులు  దూసుకెళ్లి గ్యాస్ వదిలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్ సభ జరుగుతుండగా వారి లోపలికి ఎలా వెళ్లారు..   వారికి ఎవరైనా సహకరించారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ ఘటనపై  లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా స్పందించారు.  ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని ,అందుకు పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.  లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు 

సభలో వదిలిన పొగ ప్రమాదకరమైనది కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు  స్పీకర్ ఓంబిర్లా. అది కలర్ స్మోక్  అని ఎంపీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ అన్నారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని  భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.  వారిని హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.  హరియాణాకు చెందిన నీలం, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే, కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్‌ పేర్లను  అధికారులు వెల్లడించారు.  

ఇవాళ ఉదయం సభలోకి ప్రవేశించిన అగంతకులు షూలలో రహస్యంగా గ్యాస్ అమర్చుకుని  విజిటర్స్ గ్యాలరీలోకి  ప్రవేశించి సభలో దూకారు. సభలో కొద్ది సేపు బల్లలపై దూకుతూ గందరగోళం సృష్టించారు. దీంతో సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఊహించని పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.