ఒక్క పొరపాటు.. 15 ప్రాణాలు తీసింది

ఒక్క పొరపాటు.. 15 ప్రాణాలు తీసింది

కోహిమా/గౌహతి/న్యూఢిల్లీ: అందరూ కోల్‌‌‌‌ మైన్‌‌‌‌ వర్కర్లు.. పని పూర్తి చేసుకుని వ్యానులో ఇండ్లకు బయల్దేరారు.. అలసట మరిచిపోయేందుకు పాటలు పాడుకుంటున్నారు.. ఇంతలో బుల్లెట్ల వర్షం. కాల్పులు జరుపుతున్నది నక్సలైట్లో, టెర్రరిస్టులో కాదు.. ఆర్మీ సోల్జర్లు!! కార్మికులను.. నిషేధిత సంస్థకు చెందిన మిలిటెంట్లని పొరపాటుపడిన సోల్జర్లు ఫైరింగ్‌‌‌‌కు దిగారు. తమ వాళ్లు చనిపోవడంతో స్థానికులు విధ్వంసానికి దిగారు. వారిపై ఆత్మరక్షణకోసం సైనికులు మరోసారి కాల్పులు జరిపారు. దీంతో 14మంది పౌరులు, ఒక సోల్జర్ చనిపోయారు. నాగాలాండ్‌‌‌‌లో జరిగిందీ విషాదం.

సమాచార లోపం వల్ల..

మోన్ జిల్లా మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. నిషేధిత నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్ఎస్‌‌‌‌సీఎన్–కే) కార్యకలాపాలు ఇక్కడే ఎక్కువ. ఈ క్రమంలో ఎన్ఎస్‌‌‌‌సీఎన్-–కేలో యుంగ్ ఆంగ్ వర్గానికి చెందిన తిరుగుబాటుదారుల కదలికల గురించి ఆర్మీకి నమ్మకంగా తెలిసింది. దీంతో శనివారం సాయంత్రం మోన్ జిల్లాలోని తిరు ఏరియాలో ఒక నిర్దిష్ట ఆపరేషన్ నిర్వహించాలని ఆర్మీ ఆఫీసర్లు ప్లాన్ చేశారు. ఓటింగ్–తిరు గ్రామాల మధ్యకు బలగాలు చేరుకోగా.. అదే సమయంలో ఒక వ్యాన్ అక్కడికి వచ్చింది. కోల్‌‌‌‌ మైన్‌‌‌‌లో పని చేసే కొందరు వర్కర్లు అందులో ఉన్నారు. వాళ్లే తిరుగుబాటుదారులని పొరపాటు పడిన సైనికులు కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు కార్మికులు 
స్పాట్‌‌‌‌లోనే చనిపోయారు.

గ్రామస్తుల విధ్వంసానికి భయపడి.. మళ్లీ కాల్పులు

పనులకు వెళ్లిన తమ వాళ్లు ఎంతకీ ఇండ్లకు రాకపోవడంతో.. వాళ్లని వెతికేందుకు యువకులు, స్థానికులు బయల్దేరారు. ఈ క్రమంలో సైనికులే తమ వాళ్లపై కాల్పులు జరిపారని.. ఆర్మీ వెహికల్స్‌‌‌‌ను చుట్టుముట్టారు. ఈ సమయంలో జరిగిన కొట్లాటలో ఒక సైనికుడు చనిపోయాడు. ఆర్మీ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు సోల్జర్లు మరోసారి కాల్పు లు జరిపారు. దీంతో మరో ఏడుగురు స్థానికులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఆదివారం కొన్యాక్ యూనియన్ ఆఫీసులు, అస్సాం రైఫిల్స్ క్యాంపులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో మరోసారి సైనికులు కాల్పులు జరపగా.. ఓ పౌరుడు చనిపోగా, మరో ఇద్దరికి బుల్లెట్​ గాయాలయ్యాయి. 

ఇంటర్నెట్ నిలిపివేత

రెచ్చగొట్టే వీడియోలు, ఫొటోలు సర్క్యులేట్ అయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మోన్ జిల్లాలో ఇంటర్నెట్, డేటా సర్వీసులను నాగాలాండ్ ప్రభుత్వం నిలిపేసింది. బల్క్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌లను కూడా ఆపేసింది. ఐజీ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌‌‌(సిట్)ను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఘటన పొరపాటున జరిగిందా లేక ఇంకేమైనా కారణముందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోన్‌‌‌‌లో 15మందికి పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌‌‌‌గా ఉండటం తో అస్సాంలోని ఆస్పత్రులకు తరలించారు. మిగతా వారికి స్థానికంగా ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. 

హోం మినిస్ట్రీ ఏం చేస్తోంది: రాహుల్

మన సొంత దేశంలో పౌరులు, భద్రతా బలగాలు సేఫ్​గా లేనప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చేస్తోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నాగాలాండ్ ఘటన హృదయవిదారకమని, కేంద్రం దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో తరచుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను, దేశ భద్రతను కాపాడటంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందనడానికి ఇది స్పష్టమైన  ఉదాహరణ’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

న్యాయం జరుగుతుంది: నాగాలాండ్ సీఎం

కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తామని నాగాలాండ్ సీఎం నీఫియూ రియో చెప్పారు. ‘‘పౌరులు చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఘటనపై హై లెవెల్‌‌‌‌ సిట్ దర్యాప్తు చేస్తుంది. చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు శాంతంగా ఉండాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ: ఆర్మీ

నాగాలాండ్ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆర్మీ ఆదేశించింది. ఒక సోల్జర్​  చనిపోయార ని, మరికొందరు గాయపడ్డారని తెలిపింది. మోన్‌‌‌‌లో జరిగిన ఘటనలు విచారకరమని, ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. విచారణ రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించిం ది. ఘటనపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌‌‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె ఆరా తీశారు.