పనిచేస్తున్న ఇంట్లో రాబరీకి సెక్యూరిటీ గార్డు యత్నం ..ఆరుగురు నిందితులు అరెస్ట్

పనిచేస్తున్న ఇంట్లో రాబరీకి సెక్యూరిటీ గార్డు యత్నం ..ఆరుగురు నిందితులు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ సెక్యూరిటీ గార్డు తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేయాలని చూశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 23/ఎ  ప్లాట్ నంబర్ 341/ఎలో ఉంటున్న అజయ్ అగర్వాల్  ఇంటికి సెక్యూరిటీ గార్డుగా కిలికటవాలి  దాదా పీర్(40) పనిచేస్తున్నాడు. ఇతడు ఆ ఇంట్లోనే రాబరీ చేయాలని పథకం పన్నాడు. 

ఈ నెల 22న అర్ధరాత్రి తన స్నేమితులైన మల్లెల సాయికుమార్ , షేక్ ఇర్ఫాన్ ఖాన్ భాష, బీకే చైతన్య, నరసింహ చరణ్, సంగు కృష్ణ కాంత్ , ఎరుకుల గురుస్వామిని తీసుకొచ్చాడు. వీరంతా అజయ్ అగర్వాల్  ఇంట్లో ప్రవేశించి డ్రైవర్ గా ఉన్న చంద్  దయాల్(61) రూంలోకి వెళ్లారు. డ్రైవర్​ చేతులు కట్టేసేందుకు ప్రయత్నించగా ఆయన ప్రతిఘటించాడు. 

వారు వెంట తెచ్చుకున్న  కత్తితో  గాయపరచగా అప్రమత్తమైన ఆయన అలారం మోగించాడు. తేరుకున్న అగర్వాల్ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా  వారు పరారయ్యారు. పోలీసులు సోమవారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఎరుకుల గురుస్వామి కోసం గాలిస్తున్నారు.