- ట్రాఫిక్ కంట్రోల్ చేసుడే పెద్ద టాస్క్
- గద్దెల వద్ద ఒక్కొక్కరికి 3 గంటలే డ్యూటీ
- ములుగు నుంచి పస్రా దాకా 4 కి.మీ క్యాంప్
- డ్రోన్ కెమెరాలతో పహారా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : లక్షల మంది తరలివచ్చే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడంలో పోలీసులదే కీ రోల్. ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు దగ్గరి నుంచి మొదలుపెడితే అమ్మవార్లను గద్దెలకు తీసుకురావడం, తీసుకువెళ్లడం, క్రైమ్ కంట్రోల్, ఇతర ఏ ఘటనలు జరగకుండా చూడడం లాంటి పనుల వరకు మొత్తం పోలీసుల మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకే ఈసారి కూడా మహాజాతర ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా కొనసాగించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే జాతరకు కోటి 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో 10,300 మంది పోలీసులు సిద్ధమయ్యారు. అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి పర్యవేక్షణలో వీరంతా పనిచేయనున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి వరంగల్ సీపీ, ఐజీ తరుణ్ జోషి, జాతరలో ఇతర డ్యూటీలను ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే మేడారంలో కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు. ఈ నెల 10 నుంచే పోలీసులంతా డ్యూటీల్లో చేరనున్నారు.
ట్రాఫిక్ సమస్య క్లియర్ అయ్యేనా
జాతరలో ప్రతిసారి ట్రాఫిక్ జాం సమస్య తలెత్తుతోంది. రోడ్లపై గంటల కొద్దీ వెహికిల్స్ ఆగిపోయి మేడారం ఎప్పుడు చేరతామా అని భక్తులు వేచి చూడాల్సి వస్తోంది. గతంలోనూ ఇలాగే జరగడంతో ఈసారి రిపీట్ కాకుండా చూడాలని ప్లాన్ వేస్తున్నారు. జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు, 3.5 లక్షల ప్రైవేట్ వెహికిల్స్, 40 వేల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వస్తుంటాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం 163 నేషనల్ హైవేపై 70 శాతం, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, ఆజంనగర్ మీదుగా 20 శాతం, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా 10 శాతం ట్రాఫిక్ ఉంటుందని ఇప్పటికే గుర్తించారు. జనగామ జిల్లా పెంబర్తి నుంచి మేడారం వరకు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ టీం ఇన్‌చార్జీగా వరంగల్ సీపీ, ఐజీ తరుణ్ జోషికి.. డీజీపీ బాధ్యతలు అప్పగించారు. ఒక్క గంట కూడా ఎక్కడా వెహికిల్స్ ఆగకుండా చూడాలని ఆయన సీపీని ఆదేశించారు.
24 గంటలు పని చేసే కంట్రోల్‌రూమ్
మహాజాతర కోసం ఇప్పటికే 382 సీసీ కెమెరాలను ఫిట్ చేశారు. అమ్మవార్ల గద్దెల దగ్గర నుంచి మొదలుకుంటే పార్కింగ్ ప్లేస్‌లు, రోడ్లపై, మేడారం చుట్టుపక్కల వీటిని బిగించారు. ఇవికాకుండా వెహికిల్స్‌ను, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు సర్వైలెన్స్ కెమెరాలు, సెక్యూరిటీ కోసం డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. వీటన్నింటిని మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంకు లింక్ చేశారు. 24 గంటల పాటు కమాండ్ కంట్రోల్ రూం పనిచేస్తుంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు.
పస్రా నుంచి 2 కిలోమీటర్లకో క్యాంప్
ములుగు నుంచి పస్రా వరకు 28 కి.మీ దూరంలో ప్రతీ 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. పస్రా నుంచి మేడారం వరకు ప్రతీ 2 కిలోమీటర్‌కు ఒక క్యాంప్ ఉంటుందని చెప్పారు. మండల హెడ్ క్వార్టర్లు, వరంగల్ టౌన్‌లో కూడా పోలీసులు జాతర డ్యూటీలు చేస్తారన్నారు. ఎక్కడైనా వెహికిల్ ఆగిపోతే దాన్ని రోడ్డు కిందికి దించడానికి ఈ సారి పార్కింగ్ క్రేన్స్, జేసీబీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ రోజు రోడ్లపై పోలీసులు టూ వీలర్లపై పర్యవేక్షిస్తారన్నారు.
33 పార్కింగ్ ప్లేస్‌లు
గద్దెలకు దగ్గరగా 33 పార్కింగ్ ప్లేస్‌లను గుర్తించారు.1100 ఎకరాల్లో వెహికిల్స్ నిలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పస్రా నుంచి మేడారం రూట్‌లో ప్రైవేట్ వెహికిల్స్‌కు పర్మిషన్ ఉండడం వల్ల ఈ రూట్‌లోనే 20కి పైగా పార్కింగ్ ప్లేస్‌లు సెలెక్ట్ చేశారు. వరంగల్ టు పస్రా, భూపాలపల్లి టు ఆత్మకూరు, భూపాలపల్లి టు మేడారం రూట్లలో 29 హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
8 మంది ఐపీఎస్‌లు
జాతరలో 8 మంది ఐపీఎస్‌లు డ్యూటీలు చేయనున్నారు. అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి టోటల్ టీంకు ఇన్‌చార్జీగా వ్యవహరించనున్నారు. వరంగల్ సీపీ తరుణ్ జోషి, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, అడిషనల్ డీసీపీలు సాయి చైతన్య, గౌస్ ఆలం, ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సుధీర్ ఆర్ కేకన్, అశోక్ కుమార్, ట్రైనీ ఐపీఎస్‌లు డ్యూటీలు చేస్తారు. వీరితో పాటు భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, ఇతర జిల్లాలకు చెందిన ఆఫీసర్లు, సిబ్బంది అంతా కలిసి 10,300 మంది విధుల్లో పాల్గొంటారు. గద్దెల దగ్గర పోలీసులకు 3 గంటలే డ్యూటీ ఇచ్చారు.
