నిజామాబాద్ లో వీడని వాన

నిజామాబాద్ లో  వీడని వాన

నిజామాబాద్, వెలుగు: మంజీరా, గోదావరి, హరిద్రా నదులు ఒక చోట కలిసే (త్రివేణి సంగమం) రెంజల్​మండలం కందకుర్తి వద్ద వరద నీటి ఉధృతి కొనసాగింది. మహారాష్ట్రకు వెళ్లడానికి నదిపై నిర్మించిన బ్రిడ్జికి దగ్గరగా ప్రవాహం కనిపిస్తోంది. పుష్కర్​ ఘాట్​కు చేరువలోని పురాతన శివాలయాన్ని నీట ముంచుతూ గోదావరి పరవళ్లు తొక్కింది. శుక్రవారం 92,590 క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి నీరు ఎస్సారెస్పీకి ప్రాజెక్ట్​కు చేరింది.  ఎస్సారెస్పీ పూర్తి నీటి నిలువ కెపాసిటీ 90.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.701 టీఎంసీల నీరు ఉంది. ఈ అయిదు రోజుల్లో దాదాపు 20 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది.​ జిల్లా సరిహద్దులోని సాలూరా బ్రిడ్జి మీదుగా మంజీరా నీరు ప్రవహిస్తోంది.

 దీంతో మహారాష్ట్రకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పురాతన బ్రిడ్జి మీదుగా నదిలో నీటి ఉధృతి కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో నదీ తీర ప్రాంత గ్రామాలను ఆఫీసర్లు అలర్ట్​ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోపాల్​ మండలంలో ఆరు ఇండ్లు ధ్వంసమయ్యాయి. నారు సిద్ధంగా ఉన్న రైతులు వర్షంలోనే నాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయానికి 931 మి.మీల వర్షం కురిసింది. మబ్బులు కమ్మిన వాతావరణం యథావిధిగా కొనసాగింది. రెంజల్​మండలంలోని అత్యధికంగా 75.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా, నవీపేట 74, కోటగిరి 66.6, ఎడపల్లి 60.6, వర్ని 54 మి.మీటర్ల వర్షం కురిసింది.


కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ లో​అయిదు రోజులుగా వాన వీడడం లేదు. జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు వర్షం కురిసింది. కంటిన్యూగా వర్షంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తుండడంతో మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. పెద్ద శక్కర్ల, హసన్​టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్, గోజేగావ్​కు రాకపోకలు ఆగిపోయాయి. నిజాంసాగర్ ​ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి  భారీ వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి 38,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. 

నీటి సామర్థ్యం 1,405 అడుగులకు గాను 1,395 అడుగులకు నీటి మట్టం వచ్చింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్​ పూర్తిగా నిండింది. ప్రాజెక్ట్​ సామర్థ్యం 1.8 టీఎంసీలకు కాగా, శుక్రవారం పొద్దున పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది.   భిక్కనూరులో 24 గంటల్లో  7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగిరెడ్డిపేటలో 7.1 సెం.మీ., నస్రుల్లాబాద్, లింగంపేటలో 6.9 సెం.మీ. చొప్పున, ఎల్లారెడ్డిలో 6.8 సెం.మీ.,  బాన్సువాడలో 6.6 సెం.మీ., నిజాంసాగర్​లో 6.3 సెం.మీ., గాంధారిలో 6.2 సెం.మీ., దోమకొండలో 5.4 సెం.మీ,.మద్నూర్​లో 5 సెం.మీ., బీబీపేటలో 6 సెం.మీ., పాల్వంచలో 5 సెం.మీ., కామారెడ్డిలో 4.2 సెం.మీటర్ల వర్షం కురిసింది.