కథ లేకపోతే  ప్రేక్షకులు కనికరించట్లే

కథ లేకపోతే  ప్రేక్షకులు కనికరించట్లే

కటౌట్ కాదు కంటెంట్ ఏ ముఖ్యమంటున్నారు సినీఅభిమానులు. ఎంతపెద్ద కటౌట్ ఉన్నాసరే... ఆ  సినిమాలో కంటెంట్ లేకుంటే ఆ మూవీ గురించి మాట్లాడుకోడానికి కూడా ఇష్టపడట్లేదు. దీంతో వందల కోట్లు పెట్టి తీసినా సినిమాలు సైతం అదే స్పీడ్ లో బోల్తాపడ్తున్నాయి. కంటెంట్ లేని సినిమాల్ని ప్రేక్షకులు తిప్పికొడ్తున్నారు. వందల కోట్లు పెట్టినా... కథ లేకపోతే కనికరింట్లేదు లేదు.

పరిస్థితుల్ని చూస్తుంటే స్టార్డమ్ కాలంపోయి మళ్లీ కథకే పెద్దపీట వేసే రోజులు మొదలయ్యాయనిపిస్తోంది. బడాస్టార్లు ఉన్నా కథలేని సినిమాలు ఫ్లాప్ అవుతుంటే.. కంటెంట్ ఉన్న చిన్నసినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ని తెచ్చిపెడ్తున్నాయి.

ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2, ఒకే ఒక జీవితం వంటి సినిమాలకి జనాలు క్యూ కట్టారు. ఇంకా కడ్తూనే ఉన్నారు. ఇందుకు కారణం ఆయా సినిమాల్లో కంటెంట్ మంచిగుండటమే. ఇక భారీ అంచనాలేమి లేకుండా.. సినిమా రిలీజ్ కి థియేటర్లు కూడా దొరకడానికి ఇబ్బందిపడ్డ కార్తికేయ2 మూవీకి అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను బ్రహ్మరథం పట్టారు. దీంతో ఏ సినిమా బ్లాక్ బాస్టర్ కావాలన్నా... హీరో ఇమేజ్ కంటే ఎక్కువగా.. కథ, కథనమే ప్రధానం.

ప్రేక్షకులు కూడా మూసధోరణి సినిమాలు కాకుండా కొత్తదనాన్నే కోరుకుంటున్నారు. ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఇప్పుడు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇటీవల బ్రహ్మాస్త్రం ప్రెస్ కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీ అంతా ప్రెజర్ లో ఉందన్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారన్నాడు. 

సినీ పరిశ్రమ మారాలి. కథల ఎంపిక, సినిమా తీసే విధానం అన్నింట్లోనూ కొత్తదనం అవసరం. నటీనటులు కూడా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏళ్ల తరబడి అదే ఫార్మాట్ అంటే.. ప్రేక్షకులకి నచ్చట్లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్లు కూడా హీరోల భారీ ఎలివేషన్ పై కాకుండా కంటెంట్ పై మరింత దృష్టిపెడితే బాగుటుందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. 

ఇక తెలుగు సినిమాల్లో కంటెంట్ ని పక్కనపెట్టి కటౌట్లతో నెట్టుకురావడం అలవాటైపోయింది. కానీ ఆడియన్స్ మాత్రం నో కటౌట్.. ఓన్లీ కంటెంట్ అంటున్నారు. చివరికి తాము అభిమానంచే హీరో సినిమా అయినా సరే.. కథ బాగుంటేనే చూస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజైతే ఫస్ట్ మూడు రోజులు టికెట్స్ కూడా దొరికేవి కావు. ఇప్పుడు సినిమా బాగుందని టాక్ వస్తేనే థియేటర్ కి వస్తున్నారు. లేదంటే ఓటీటీకి వస్తుంది కదా అని లైట్ తీసుకుంటున్నారు.