వాహన తనిఖీల్లో..గంజాయి పట్టివేత

 వాహన తనిఖీల్లో..గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద ఆబ్కారీ పోలీసులు మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పల్సర్​ బైక్​ పై అక్రమంగా తరలిస్తున్న 2.6 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్​ నుంచి ఖమ్మం పట్టణానికి తీసుకెళ్లి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నట్లు పట్టుబడిన నిందితుడు అద్దంకి పవన్​ విచారణలో ఒప్పుకున్నాడు. బైక్​తో పాటు సెల్​ ఫోన్​ స్వాధీనం చేసుకుని పవన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ సర్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

చాక్లెట్ల రూపంలో.. 

ఖమ్మం టౌన్  :  ఖమ్మం సిటీలోని కాల్వ ఒడ్డులో ఆబ్కారీ జిల్లా టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) సీఐ రేండ్ల విజయేందర్ బృందం ఆధ్వర్యంలో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా మూడు కిలోల గంజాయి చాక్లెట్స్, 8 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. కాల్వ ఒడ్డులో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

వారి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి దొరికింది. నిందితులు  ఔరంగబాద్, మహారాష్ట్రకు చెందిన రాఖీగణేశ్​ చౌహన్, బాలి వసంత్ గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తనిఖీలో ఎస్సై లు అచ్చారావు, నాగేశ్వరరావు, విశ్వనాథ్, కానిస్టేబుల్ నరేశ్ ​పాల్గొన్నారు. 

బస్సులో తరలిస్తుండగా.. 

అశ్వారావుపేట :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దుల్లో ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా.. తనిఖీల్లో భాగంగా పోలీసులు బస్సును పరిశీలించారు. బస్సులోని ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. వారి బ్యాగులు తనిఖీ చేయగా 60 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.