దుర్గం చిన్నయ్యకు ఓటు వేస్తే.. మహిళలకు రక్షణ ఉండదు: శేజల్

దుర్గం చిన్నయ్యకు ఓటు వేస్తే.. మహిళలకు రక్షణ ఉండదు: శేజల్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ బెల్లంపల్లిలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. సెప్టెంబర్ 01 శుక్రవారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో శేజల్ దుర్గం చిన్నయ్యకు ఓటు వేయద్దని ప్రచారం చేపట్టింది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో దుర్గం చిన్నయ్యకు ఓటు వేయద్దని ప్రచారం చేసింది. ఆడపిల్లలను లైంగిక వేధించే దుర్గం చిన్నయ్యకు ఓటు వేస్తే.. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ప్రతి షాపుకు వెళ్లి శేజల్ ప్రచారం నిర్వహించింది.

ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. శేజల్ కు మద్దతుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు శేజల్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు భగత్ సింగ్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఇది ఇలా ఉండగా శేజల్ మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి గొడవ చేశారు.