గ్రామ, వార్డు సభల ద్వారా దళితబంధు లబ్దిదారుల ఎంపిక

గ్రామ, వార్డు సభల ద్వారా దళితబంధు లబ్దిదారుల ఎంపిక
  • లబ్దిదారుల జాబితా డిస్ ప్లే చేసి అభ్యంతరాలు స్వీకరణ
  • ఎవరికైనా స్కీం రాకపోతే మరోసారి పరిశీలించి తిరిగి జాబితాలో చేర్చే అవకాశం 
  • మాకు రాదేమోనన్న ఆందోళన వద్దు.. అర్హులైన వారందరికీ వస్తుంది
  • దళితబంధు స్కీం వల్ల వచ్చే సమస్యలు తెలుసుకునేందుకు పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ఎంపిక
  • చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకం విధి విధానాలపై స్పష్టత ఇచ్చారు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్.  ఈనెల 16న సీఎం ప్రారంభించే దళిత బంధు పథకంపై కలెక్టరేట్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులతో సమీక్ష అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సభల ద్వారా దళితబంధు లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని.. లబ్దిదారుల జాబితా డిస్ ప్లే చేసి అభ్యంతరాలు స్వీకరణ జరుగుతుందన్నారు. ఎవరికైనా స్కీం రాకపోతే మరోసారి పరిశీలించి తిరిగి జాబితాలో చేర్చే అవకాశం ఉంటుందన్నారు. మాకు రాదేమోనన్న ఆందోళన వద్దు.. అర్హులైన వారందరికీ వస్తుందని, దళితబంధు స్కీం వల్ల వచ్చే సమస్యలు తెలుసుకునేందుకు పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ఎంపిక చేశామని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ వివరించారు. 
దళితబంధు స్కీం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరిస్తూ మిగతా ప్రాంతాల్లో వర్తింపజేయాలన్నది  ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దేశంలో ఇలాంటి పథకం మనదగ్గరే  మొదటిసారి  తెచ్చాం, అర్హులైన  ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింప జేస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇస్తామని, గతంలో బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందులుండేవి,  కానీ ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తాయన్నారు. 
నచ్చిన ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చు
పది లక్షలు వచ్చిన వాళ్లు.. తమకు నచ్చిన ఉపాధి పొందేందుకు వీటిని ఖర్చు చేసుకోవచ్చని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తమకు వివిధ వృత్తుల్లో ఉన్న అనుభవం ఆధారంగా ఉపాధి కార్యక్రమాలు ఎంచుకోవచ్చని, ఉపాధి అంశాల ఎంపికపై సలహాలు అవసరమైన వారికి అధికారులు సహకరిస్తారన్నారు. దళిత బంధు పథకం అమలు కోసం..  గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు ఉంటాయని, ఈ కమిటీలు దళిత బందు ద్వారా ఎలా ఉపాధి మార్గాలు ఎంచుకోవచ్చన్నది సూచిస్తాయి. 
రాష్ట్రమంతా ఈ స్కీం అమలవుతుంది... అనుమానాలు వద్దు
దళితబంధు పథకం ఇంకా ఆరంభ దశలోనే ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఈనెల 16న జరిగే దళిత బంధు సభలో 15 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందిస్తామని, ఆ తర్వాత  ఈ పథకం అందరికీ లబ్ధి చెందేలా అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు. మాకు రాదేమోనన్న ఆందోళనకు ఎవరికీ అవసరం లేదు, అర్హులైన వారందరికీ ఈ పథకం లబ్ధి అందుతుందన్నారు. ఇది పైలట్ ప్రాజెక్టు కాబట్టి ఏదైనా సమస్యలు వస్తే పరిశీలిస్తూ పరిష్కరిస్తామన్నారు. 
పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ లో ప్రారంభం అవుతుంది: రాహుల్ బొజ్జ
దళిత బంధు పతకం పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ లో ప్రారంభం అవుతోందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  రాహుల్ బొజ్జ తెలిపారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇది వర్తిస్తుందన్నారు. హుజురాబాద్ లో 106 గ్రామాల్లో దళిత కుటుంబాలున్నాయని, సమగ్ర కుటుంబ సర్వే డేటా బేస్ ఆధారంగా ప్రతి గ్రామంలో, వార్డులో, జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో టీం మళ్లీ వెరిఫై చేసి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. సమగ్ర సర్వేలో మిస్సైన వారి పేర్లు కూడా అధికారులు తీసుకుని అర్హులైతే వారికి కూడా పథకం అందేలా చూస్తామన్నారు. వార్డులో, గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు నిర్వహించి దళిత బంధు కో-ఆర్డీనేటర్ల సహకారంతో, స్థానిక ప్రజా ప్రతినిధులు, దళిత కుటుంబాల సమక్షంలో చర్చ జరిపి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యంతరాలు కూడా ఉంటే పరిగణలోకి తీసుకుంటామని, కలెక్టర్ ద్వారా లబ్ధిదారులకు పథకం శాంక్షన్ ఇస్తామన్నారు. 
ప్రతి కుటుంబంతో అధికారుల బృందం చర్చ 
దళిత బంధు సహాయం పొందే లబ్దిదారుల ప్రతి కుటుంబంతో కూడా అధికారుల బృందం కూర్చుని వాటితో ఏ స్కీం తీసుకుంటారన్నది కూడా చర్చిస్తారని రాహుల్ బొజ్జ తెలిపారు. ఒకే గ్రామంలో అందరూ ఒకే స్కీం తీసుకోవాలనుకుంటే.. వాటి డిమాండ్, ఇతర అంశాల ఆధారంగా స్కీంలను ఫైనలైజ్ చేస్తామన్నారు. దళితులు ఎంపిక చేసుకున్న స్కీంలపై పూర్తిగా అధ్యయనం చేస్తామని, రెండు, మూడు సంవత్సరాలపాటు లబ్ధి పొందిన దళిత కుటుంబాలు చేస్తున్న వ్యాపార కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తూ అధికారులు సలహాలు ఇస్తారని వివరించారు. అత్యంత నిరుపేద కుటుంబాల దళితులకు అనుకోని ఆపద వస్తే.. వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మరో అనుబంధ పథకం కూడా తెస్తున్నామన్నారు. లబ్ధిదారుల నుంచి కొంత వాటా, అంతే మొత్తం ప్రభుత్వ వాటా ఇచ్చి బీమా కల్పిస్తామన్నారు.