సర్కార్ యూనివర్సిటీల్లో పెరిగిపోయిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు

సర్కార్ యూనివర్సిటీల్లో పెరిగిపోయిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీల్లో రెగ్యులర్ కోర్సుల కన్నా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల సంఖ్య పెరిగిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్, జాబ్ ఓరియంటెడ్ కోర్సుల పేరిట గత పది, పదిహేనేండ్లుగా కొత్త పీజీ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రారంభిస్తున్న వైస్ చాన్స్ లర్లు.. వాటిని రెగ్యులర్ కోర్సులుగా మార్చడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్యార్థులకు ఫీజుల భారం, లెక్చరర్లకు అరకొర జీతాల బాధ తప్పడం లేదు. శాతవాహన యూనివర్సిటీలో ఐదు, కేయూ ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చేయగా.. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులపై అధ్యయనం పేరుతో ప్రత్యేకంగా ప్రొఫెసర్లు, ఈసీ మెంబర్లతో కమిటీలు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్ కోర్సుల నిర్వహణతో రాష్ట్ర సర్కార్​పై భారం పడుతుందనే ఉద్దేశంతో..  క్రమంగా రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మారస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు హాస్టల్ వసతి కల్పించకపోవడం కూడా ఈ కుట్రలో భాగమనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

కొత్త కోర్సులన్నీ ఎస్ఎఫ్ సీ పద్ధతిలోనే

యూనివర్సిటీల్లో గతంలో అన్ని రెగ్యులర్ కోర్సులనే నిర్వహించేవారు. ఈ కోర్సుల నిర్వహణకు ప్రొఫెసర్ పోస్టులను సాంక్షన్ చేయడంతోపాటు వారి జీతాలకు యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంటుంది. కానీ, గత 15, 20 ఏండ్లలో సంప్రదాయక కోర్సులు కాకుండా జర్నలిజం, సోషల్ వర్క్, టూరిజం, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సైకాలజీ, బయోటెక్నాలజీ, ఇంజినీరింగ్ తదితర అనేక కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రారంభించారు. వీటితోపాటు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు యూనివర్సిటీలు లేని జిల్లాల్లో, డివిజన్ సెంటర్లలో యూనివర్సిటీలకు అనుబంధంగా పీజీ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఓయూ పరిధిలో సిద్దిపేట, నర్సాపూర్, వికారాబాద్, జోగిపేట, సంగారెడ్డిలో, కేయూ పరిధిలో సుబేదారి మహిళా పీజీ కాలేజీ, మహబూబాబాద్, జనగామ పీజీ కాలేజీలు ఇలా ఏర్పాటైనవే. యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించే చాలా రెగ్యులర్ కోర్సులను ఈ పీజీ సెంటర్లలో సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలోనే ప్రారంభించారు. 

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరినోళ్లకు నో హాస్టల్

యూనివర్సిటీల్లో గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన వారికి నిరుడు వరకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించేవారు. కానీ, ఈ అకడమిక్ ఇయర్ నుంచి హాస్టల్ ఫెసిలిటీ లేదని అడ్మిషన్ టైంలోనే చెప్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓయూలో వీసీ బిల్డింగ్​ను పీడీఎస్​యూ విద్యార్థులు ముట్టడించగా.. యూనివర్సిటీ అధికారులు దిగొచ్చి ఎస్ఎఫ్​సీ స్టూడెంట్స్​కు  కూడా హాస్టల్ అడ్మిషన్​కు నోటిఫికేషన్ ఇచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా వీసీ పట్టించుకోవడం లేదు. 

కోర్సుల నిర్వహణపై కమిటీలు

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వయబులిటీని అధ్యయనం చేసేందుకు ఓయూ లా ప్రొఫెసర్ జీబీ రెడ్డి కన్వీనర్​గా అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్, డిపార్ట్​మెంట్ల హెడ్స్ సభ్యులుగా సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే కేయూలో ఎస్డీఎల్సీఈ డైరెక్టర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు కన్వీనర్ గా సబ్ కమిటీ ని వేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల బలోపేతం, కొత్త కోర్సుల ఏర్పాటు కోసం ఈ సబ్ కమిటీలను నియమించినట్లు వైస్ చాన్స్ లర్లు బయటికి చెప్తున్నప్పటికీ.. కోర్సులను క్లోజ్ చేసేందుకే ఏర్పాటు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

యూజీసీకి అప్లై చేయడంలో అలసత్వం

యూజీసీ నిబంధనల ప్రకారం.. ఏదైనా కోర్సు కనీసం 5 ఏండ్లు సక్సెస్ ఫుల్​గా నడిస్తే ఆ కోర్సును రెగ్యులర్ కోర్సుగా మార్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా యూజీసీకి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ కోర్సుగా మార్చితే యూజీసీనే ఐదేండ్లపాటు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక్క కోర్సును కూడా గత వీసీలుగానీ, ఇప్పటి వీసీలుగానీ రెగ్యులర్ కోర్సుగా మార్చేందుకు ప్రపోజల్స్ పంపిన పాపానపోలేదు. సర్కార్ నుంచి ఆ ప్రయత్నమే జరగలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా వచ్చే ఫీజులతోనే పార్ట్ టైం లెక్చరర్లకు నెలకు రూ.15 వేలు, రూ.20 వేల చొప్పున జీతాలిస్తున్నారు. వీళ్లంతా పీహెచ్​డీ, నెట్, సెట్ అర్హతలు కలిగినవారే. ఎప్పటికైనా కోర్సును రెగ్యులర్ కోర్సుగా మార్చకపోతారా అనే ఆశతో పని చేస్తున్నారు.