తెలంగాణలో ఆత్మగౌరవ పాలన ఆరంభం

తెలంగాణలో ఆత్మగౌరవ పాలన ఆరంభం

సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం ప్రజలు మరో పదేండ్లు నిరీక్షణ. ఇక్కడి ప్రజలు సాధించుకున్నవన్నీ పోరాటాలతోనే.  అప్పుడు సీమాంధ్ర పెత్తందార్లతో పోరాటం. రాష్ట్రం వచ్చిన తర్వాత గడీల పాలనతో ఘర్షణ.  ఆధిపత్యాన్ని ఈ నేల భరించదు. దానిపై తిరగబడుతుంది. అవిరామంగా పోరాడుతుంది. అదే ఇక్కడ జరిగింది. 2023 డిసెంబర్ ఏడో తారీఖున ఉక్కు కంచెలు బద్దలుకావడం  తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదు.

పరిపాలనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పరచిన ఉక్కు కంచె అది. దాన్ని  ప్రజాప్రభుత్వం తొలగించింది. ప్రజాకాంక్షలకు అనుగుణమైన పాలన ప్రారంభిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది.  హైదరాబాద్ ప్రజలు కాస్త భిన్నంగా ఆలోచించినా గ్రామీణ తెలంగాణ మాత్రం పెత్తందారి పోకడలను సహించేది లేదని స్పష్టం చేసింది. 

ప్రజలతో లింక్​లేని ​పాలనను ఓడించారు

పదేండ్ల తెలంగాణ రాష్ట్ర  పాలనలో ప్రజలతో సంబంధం లేకుండానే జరిగింది. తమకు తోచిన పథకాలను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఓట్లు సీట్లే పాలసీగా మారింది.  నిరాటంకంగా తమ పాలనే సాగాలని చూసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తొలిసారి ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండో సారి బంపర్ మెజార్టీ వచ్చింది. అక్కడి నుంచి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య లింక్ పూర్తిగా తెగిపోయింది. మంత్రి వర్గ ఏర్పాటుకే  నెలల వ్యవధి పట్టింది. ఎవ్వరూ అడిగే సాహసం చేయలేదు. అడిగినా వినే వారు లేరు. ప్రజలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఎవరిని ఆశ్రయించాలో అంతకన్నా తెలియలేదు.   ప్రభుత్వ తీరు బాగా లేదని ఉప ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. అయినా బీఆర్ఎస్ నాయకులు చలించలేదు. తమకు తిరుగేలేదని భావించారు.  ప్రభుత్వమే నేను.. నేనే ప్రభుత్వం అనే తీరులో  కేసీఆర్ పాలన సాగింది.  అది  ప్రజలు అస్సలు సహించలేదు.  దాని ఫలితంగానే 39 సీట్లతో  సరిపుచ్చారు.

ప్రజలు కోరుకున్నట్లే..

పదేండ్ల తర్వాత  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా ఓటు వేశారు. తాము ఓటేస్తేనే  పాలకులు అవుతారనే విషయాన్ని గ్రహించాలనే సంకేతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అందుకే  ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే మెజార్టీనిచ్చారు. ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రజలు కోరుకున్న పాలనను అందించాలని సూచన కూడా చేశారు. తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగానే  ప్రజల  మధ్య ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు. వెనువెంటనే ఆరుగ్యారంటీల అమలు ప్రారంభించారు. ప్రగతి భవన్ పేరు మార్పు. అక్కడే ప్రజావాణి ఏర్పాటు.   తాము కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని ప్రజలు భావించేలా కొత్త ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.

ప్రజా పాలనంటే ఇదీ!

గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ సమావేశాల గురించి తెలియదు. సమీక్షల సారాంశాలు  తెలియదు. ప్రగతి భవన్ నుంచి వాట్సప్  ద్వారా వచ్చిన సమాచారం తప్ప మరోటి తెలియదు. మంత్రులకు, ముఖ్యమంత్రితో ఇష్టాగోష్టిల ముచ్చటే లేదు. అదే రాజకోట రహస్యంలా మారింది. కానీ ఇప్పుడు సచివాలయంలో మంత్రులు సమీక్షల వార్తలు రోజూ చూస్తూ ఉన్నాం. మీడియా మీట్లు జరుగుతున్నాయి. సీఎంతో పాటు మంత్రులూ సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వాధినేతలు అంటే ప్రజలకు అతీతమైన వారు కాదని  రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలోనే తేల్చి చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలకు జీవం పోస్తున్నారు. అందుకే ఉచిత బస్సు ప్రయాణం నుంచి ఆరోగ్య శ్రీకి నిధుల పెంపు వరకు చకాచకా  నిర్ణయాలు  వెంటనే జరిగిపోయాయి.  విద్య, వైద్యం.  విద్యుత్. ఇరిగేషన్ వంటి రంగాలపై ఇప్పటికే సమీక్షలు చేశారు.  భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రజోపయోగంగా ఎట్లా ఉండాలో సరి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  ఇది కదా తాము కోరుకున్న ప్రభుత్వం. ఇట్లా కదా తమ ముఖ్యమంత్రి, ఆయన మంత్రి వర్గం ఉండాలని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా కొత్త ప్రభుత్వ ఆలోచన, ఆచరణ సాగుతున్నది.

దుబారాలకు సీఎం రేవంత్ ​దూరం

రేవంత్ రెడ్డి  ముందు నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మంత్రి వర్గ కూర్పు నుంచి ఐఏఎస్, ఐపీఎస్​ల  పోస్టింగ్​ల వరకు సామాజిక సమ తూకం పాటిస్తున్నారు. అర్హులైనవారికే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. తమ బంధుమిత్ర పరివారం ఉండాలని కోరుకోవడం లేదు. ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నది. గత ప్రభుత్వంతో ప్రతి అంశాన్నీ పోల్చి చూసుకుంటున్నది. అంతే కాదు, రేవంత్ రెడ్డి కాన్వాయ్  మునుపటి ప్రభుత్వంలా లేదు. ఇప్పటికీ ఆయన తన సొంత వాహనాన్నే వాడుకుంటున్నారు. సెంటిమెంట్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం  చేయడం లేదు.  ఇదంతా కూడా ఇప్పటి వరకు ఉన్న ఆచరణలో కన్పిస్తున్న విషయాల ఆధారంగా చెప్తున్న మాటలు. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి భిన్నంగా  వెళ్లడం లేదు. వెళ్తే  ఏం జరుగుతుందో కూడా గత పాలకుల మాదిరిగానే వీరికి తెలిసి వస్తుంది. తెలంగాణ ప్రజలు చాలా సందర్భాల్లో తమ మనసుల్లో ఏం ఉందో  వెన్వెంటనే చెప్పరు. సమయం వచ్చినప్పుడు ఆచరణలో చూపిస్తారు. కాబట్టి స్వయం పాలన అంటే ఇది అనేలా ఇప్పటి తీరులోనే పాలన సాగిస్తే హస్తం నాయకత్వానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. పైగా జనరంజక పాలనకు జనం జేజేలు  పలుకుతారు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం.

ఉచితాల పట్ల ప్రజల ఔదార్యం

బహుశా ఈ దేశంలో  ప్రభుత్వం ఇచ్చే ఉచితాలను ఎవ్వరూ వద్దనరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చిన ఉచిత  బస్సు ప్రయాణాన్ని  తమకు  వద్దని  మహిళలే అంటున్నారు. ఉచిత బస్సు స్కీం సాధ్యం కాదని కొందరు అన్నారు. ఏదో జరుగుతుందని గగ్గోలు పెట్టారు. ఈ స్కీం ప్రారంభం అయిన తర్వాత చడీ చప్పుడు లేకుండా పక్కాగా అమలవుతున్నది.  ప్రజలతో మమేకం అయ్యే ప్రభుత్వం ఉంటే.. వారే తమ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వంపై భారం పడొద్దని, అతి పేదలకే ప్రభుత్వ పథకాలు చేరాలని కోరుకుంటారు. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న వాస్తవం.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక