సెల్ఫీ విత్‌ మంచితనం!

సెల్ఫీ విత్‌ మంచితనం!

లోకంలో మంచితనం చాలా తక్కువని అనుకుంటూ ఉంటాం కదా? నిజమేనేమో! కానీ, అది అప్పుడప్పుడు ఎదురొచ్చి పలకరిస్తుంది. నీవు ఎవరు? ఏం చేస్తావ్‌? ఏమిస్తావ్‌ అని వివరాలు  అడగకుండానే సాయం చేసి వెళ్లిపోతుంది. అప్పుడు దాన్ని నలుగురితో పంచుకోవాలనిపించేంత ఆశ్చర్యం, ఆనందం మనలో కలగడం ఖాయం.  మొన్న రాత్రి ముంబై సిటీలో ఆ మంచితనం బాలీవుడ్‌ స్టార్​ డైరెక్టర్‌‌ ఇంతియాజ్‌ అలీకి కూడా ఎదురైందంట. అందరూ స్టార్‌‌తో సెల్ఫీ తీసుకుంటారు. కానీ, ఆ స్టార్​ ఫస్ట్‌ టైం మంచితనంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫీలింగ్‌ ఎట్లా ఉంటుందో.. ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. అది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

రాత్రి వర్షంలో తడుస్తూ నడుస్తున్నాను. ఒక ఆటోరిక్షా వచ్చి నా దగ్గర ఆగింది.  ‘ఎక్కడికి వెళ్లాలి సార్‌‌?’ అని అడిగాడు. ‘ కావాలని నేను అడిగానా? నాకేం వద్దు వెళ్లు’ అని రిఫ్యూజ్ చేశాను.  అతను మళ్లీ అడిగాడు. జోరుగా వర్షం కురుస్తోంది. రెయిన్‌కోట్‌ వేసుకోలేదు. చేతిలో గొడుగు కూడా లేదు.  నా పర్స్ తీసి చెక్‌ చేశాను. అతని వైపు చూసి నవ్వి.. ‘నా దగ్గర పైసలు లేవు’ అన్నాను.  అతను నన్ను చూసి.. ‘పర్లేదు కూర్చోండి సార్‌‌’ అని అడిగాడు. పైసలు లేకుండా ఎవరు డ్రాప్‌ చేస్తారు? అని మనసులో అనుకున్నాను. వెంటనే ‘నువ్వు వెళ్లు.. ముందు ఇంకెవరైనా ఉంటారు’ అన్నాను.

‘వర్షం పడుతోంది సార్‌‌.. మీరు తడిసిపోతున్నారు’ అన్నాడు.  వచ్చి కూర్చోండని అడిగాడు మళ్లీ. ఫైనల్‌గా వెళ్లి కూర్చున్నాను. అతను డ్రైవ్‌ చేస్తున్నాడు. ఇద్దరం అదీ ఇదీ మాట్లాడుతుండగా..  సడెన్‌గా ఒక కారు వచ్చి ఆటో రిక్షా ముందు ఆగింది.  అందులోంచి ఒక కపుల్‌ దిగారు. నన్ను చూసి వాళ్లు నాతో సెల్ఫీ దిగుదామని వచ్చారంట! వాళ్లతో సెల్ఫీ దిగాను. ఆటోరిక్షా అతను నా వైపు కొద్దిసేపు అలా చూస్తూ ఆగిపోయాడు. తర్వాత  ‘ మీరు ఇంతియాజ్ అలీనా?’ అనడిగాడు. నేను స్మైల్‌ ఇచ్చాను. ‘సార్‌‌ మీతో ఒక సెల్ఫీ కావాలి’ అని అడిగాడు.  నో..  నీతోనే  నాకు సెల్ఫీ కావాలన్నాను. అతడితో సెల్ఫీ తీసుకున్నా!