నా ప్యానెల్‌లో గెలిచిన వాళ్లంతా రాజీనామా చేస్తరు

నా ప్యానెల్‌లో గెలిచిన వాళ్లంతా రాజీనామా చేస్తరు

హైదరాబాద్: టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లొల్లి ఆగడం లేదు. ఎలక్షన్‌లో హీరో మంచు విష్ణుపై ఓటమి పాలైన ప్రకాశ్ రాజ్ అసోసియేషన్‌లో తన సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేయగా... ఇవాళ తన ప్యానెల్‌ నుంచి ఎన్నికల్లో గెలిచిన 11 మంది వారి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. 

‘ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్స్ వచ్చాయి. ఎన్నో కలలు, ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం. నా ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు. ఆ ప్యానెల్ నుంచి సగం మంది గెలిచారు. కానీ ఈ రెండ్రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కలసి చర్చించాం. ఎలక్షన్ మొదలు నుంచి ఏదో ఒక్క ప్యానెల్‌నే ఎన్నుకోవాలని చెబుతూ వచ్చాం. క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. ఎలక్షన్‌లో చాలా రౌడీయిజం జరిగింది. మాటల పోరు జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగింది. అయినా ఎన్నికను ఆపొద్దని అనుకున్నాం. ఎక్కడెక్కడి దూరం నుంచి మనుషులను తీసుకొచ్చారు. మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు. అయినా సీనియర్ నటుడైన బెనర్జీ మీద చేయి చేసుకున్నారు. అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఆ రోజు ఎలక్షన్ ఫలితాలు వెల్లడించారు. కానీ ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్‌ను పక్కనబెట్టారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లెక్కలు మారాయి. ముందు రోజు గెలిచిన వారిని తర్వాతి రోజు ఓడిపోయారనడంతో ఆశ్చర్యం వేసింది. అందరినీ కలుపుకుని పోదామని అంటూనే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులు తమ ప్యానెల్‌కే అన్నారు. ఆ మాటలు మమ్మల్ని బాధించాయి. ఆ మాటలతో కలుపుకుని పోయే పరిస్థితి కనిపించడం లేదు. మా ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు అక్కడ పని చేయగలమా అని సందేహాలు లేవనెత్తారు. ‘మా’ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి.. మళ్లీ గొడవల్లోనే ఉండిపోతుందా అని ప్రశ్నలు వచ్చాయి. మేం 11 మంది అక్కడ ప్రశ్నించడం వల్ల ‘మా’ సంక్షేమం ఆగిపోతాయేమోనని కూడా అనిపిస్తోంది. అందుకే మేం ఓ నిర్ణయానికి వచ్చాం. వచ్చే రెండు సంవత్సరాల్లో మంచు విష్ణు బాగా పని చేయాలి. ఆయన పెద్ద హామీలు ఇచ్చారు. దానికి అడ్డురాకూడదు. ‘మా’ సంక్షేమం కోసం సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

దేశంలో 40 చోట్ల ఎన్‌ఐఏ రైడ్స్‌

గ్యాస్ పై రాష్ట్రం పన్నువేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీశ్‌ రావు

బీజేపీ గెలిస్తే కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచిస్తాడు: రఘునందన్‌