మేమొస్తే సీఏఏ రద్దు., ఇండియా కూటమిదే గెలుపు: చిదంబరం 

మేమొస్తే సీఏఏ రద్దు., ఇండియా కూటమిదే గెలుపు: చిదంబరం 

తిరువనంతపురం: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిటిజన్ షిప్ అమెండ్​మెంట్ యాక్ట్ (సీఏఏ)ను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం హామీ ఇచ్చారు. మొదటి పార్లమెంట్​ సెషన్ లోనే సీఏఏను రద్దు చేస్తామని తెలిపారు. ఆదివారం కేరళలోని తిరువనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘చట్టాల జాబితా చాలా పెద్దగా ఉంది.

అందుకే సీఏఏ రద్దును మేనిఫెస్టోలో పేర్కొనలేదు. అధికారంలోకి వస్తే తప్పకుండా సీఏఏ సహా ఐదు చట్టాలను రద్దు చేస్తాం. మేనిఫెస్టో కమిటీ చైర్మన్​గా ఇది నా హామీ” అని చెప్పారు. ‘‘సీఏఏను కాంగ్రెస్ వ్యతిరేకించలేదని కేరళ సీఎం పినరయి విజయన్ అబద్ధాలు చెబుతున్నారు. పార్లమెంట్​లో ఎంపీ శశిథరూర్ సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడారు” అని ఆయన పేర్కొన్నారు. అయోధ్య రామాలయంపై స్పందిస్తూ.. ‘‘అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తయింది.

ప్రజలు కోరుకున్నది నెరవేరింది. అది ఇంతటితో అయిపోయింది. దాని ప్రభావం ఎన్నికల్లో ఉండదు. ఎన్నికలకు, రాజకీయాలకు, రామాలయానికి ఏం సంబంధం?” అని ప్రశ్నించారు. మన భూభాగాలను చైనా ఆక్రమించుకుంటున్నదని, అయినా బీజేపీ చూస్తూ కూర్చుంటున్నదని విమర్శించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కే ఉందని, ఈసారి ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.   

బీజేపీలో మోదీ భజన.. 

బీజేపీ పార్టీ ప్రధాని మోదీ భజన బృందంగా తయారైందని చిదంబరం విమర్శించారు.  ‘‘కేవలం 14 రోజుల్లో బీజేపీ మేనిఫెస్టో తయారైంది. దానికి మేనిఫెస్టో అని పేరు పెట్టలేదు. ఆ పార్టీ నేతలందరూ దాన్ని ‘మోదీ కీ గ్యారంటీ’ అని అంటున్నారు. బీజేపీ మతపరమైన సంస్థగా మారింది” అని చిదంబరం అన్నారు. మోదీ పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. మోదీ మళ్లీ గెలిస్తే, రాజ్యాంగాన్నే మార్చేస్తారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.