సీనియారిటీ వైపే మొగ్గుచూపిన కాంగ్రెస్ అధిష్టానం..

సీనియారిటీ వైపే మొగ్గుచూపిన కాంగ్రెస్ అధిష్టానం..

అందరూ అనుకున్నట్లుగానే ఉత్కంఠ వీడింది. కర్నాకట ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. సీనియార్టీకే మొగ్గుచూపింది. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవమే సిద్ధరామయ్యను రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం తెచ్చిపెట్టింది. సిద్ధరామయ్యను రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. 

సిద్ధరామయ్యకు సమఉజ్జిగా డీకే శివకుమార్ ఉన్నప్పటికీ.. కొన్ని విషయాల్లో డీకే పోల్చితే సిద్ధరామయ్యే సరైన నాయకుడిగా కాంగ్రెస్ పెద్దలకు కనిపించారు. అందుకే కర్నాటక రాజకీయాల దృష్ట్యా.. ప్రస్తుత పరిస్థితుల్లో సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపింది అధిష్టానం.

కర్నాకట రాష్ర్టంలో అన్ని వర్గాలకు దగ్గరగా ఉంటారని  సిద్ధరామయ్యకు మంచి పేరుంది. ముఖ్యంగా ఎన్నికల ముందు సీఎంగా పాపులారిటీ సంపాదించారు. అందుకే సీనియారిటీతోనే ఆయనకు రెండోసారి సీఎం పదవి వరించింది. కర్నాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ పట్టున్న నేతగా సిద్ధరామయ్యకు గుర్తింపు ఉంది. అంతేకాదు.. చరిష్మా కలిగిన నాయకుడు కూడా. 

సిద్ధరామయ్య.. కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత. కురబ వర్గంలో ఈయన గట్టి పట్టుంది. మొదటి నుంచి పాతతరం ఎమ్మెల్యేల సపోర్టు కూడా సిద్ధరామయ్యకే ఉండడం ఆయనకు బాగా కలిసివచ్చింది. గతంలో 2013 నుంచి 2018 వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు. కర్నాటక రాష్ర్టానికి ఐదేళ్లు సీఎంగా ఉన్న  ముగ్గురిలో సిద్ధరామయ్య ఒకరని చెబుతారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారు.

కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పై ఉన్న ఈడీ వంటి పలు కేసులు సిద్ధరామయ్యకు అడ్వాంటేజ్ గా మారిందనే చెప్పాలి. అహింద వర్గంలో సిద్ధరామయ్య మంచి మాస్ లీడర్. ఇవన్నీ కూడా సిద్ధరామయ్యను రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు కలిసివచ్చిన అంశాలని చెప్పొచ్చు. 

సిద్ధరామయ్య రాజకీయ ప్రయాణం..

సిద్ధరామయ్య రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నారు. కానీ.. ఇప్పుడు అదే పార్టీలో చేరి  రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 75 ఏళ్ల సిద్ధరామయ్యకు రాజకీయాల్లో 45ఏళ్ల అనుభవం ఉంది. 

1948 ఆగస్టు 12న మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండిలో సిద్ధరామయ్య జన్మించారు. ఆయనది వ్యసాయకుటుంబం. పదేళ్ళ వయస్సు వచ్చే వరకు సిద్ధరామయ్యకు స్కూలుకు పోలేదని చెబుతారు. పొలం పనుల్లో సాయం చేస్తూ పశువులు కాసేవారంట. ఆ తరువాత ఆయన డిగ్రీ పూర్తి చేసి, మైసూర్ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు.

సిద్ధరామయ్యది బీసీకి చెందిన కురబ సామాజికవర్గం. కర్ణాటకలో కురబల జనాభా సుమారు 9 శాతం. బీసీల్లో మంచి పట్టున్న నేతగా సిద్ధరామయ్యను చూస్తారు. సిద్ధరామయ్య సోషలిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తిగా చెబుతారు. రామ్ మనోహర్ లోహియా వంటి నాయకులు ప్రభావం ఆయన మీద ఉందంటారు. 

1983లో తొలిసారి చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సిద్ధరామయ్య గెలిచారు. ఆ గెలుపుతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన జనతా పార్టీలో చేరారు. అధికార భాషగా కన్నడను ఉంచేందుకు ఏర్పాటు చేసిన కన్నడ కవలు సమితికి అధ్యక్షునిగా చేశారు.

1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ 139 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి మరొకసారి గెలిచిన సిద్ధరామయ్య.. రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పదవి చేపట్టారు.

1994లో హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. 1996లో జయదేవప్ప హలప్ప పటేల్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు సిద్ధరామయ్యను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించారు.

దేవేగౌడ నాయకత్వంలోని ఒక వర్గం జనతా పార్టీ నుంచి విడిపోయి జనతా దళ్(సెక్యులర్) పేరుతో ఒక పార్టీని స్థాపించింది. నాడు సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు. 2004లో కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉపముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు.

జేడీ(ఎస్) పార్టీలో దేవెగౌడ, సిద్ధరామయ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. జేడీ(ఎస్)లో సిద్ధరామయ్య నెంబర్ -2 నేతగా ఉండేవారు. కొడుకు కుమార స్వామి కోసం సిద్ధరామయ్యను దేవెగౌడ పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి.ఈ క్రమంలోనే చివరకు జేడీ(ఎస్) నుంచి సిద్ధరామయ్యను 2005లో బహిష్కరించారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2006 ఉపఎన్నికలో సిద్ధరామయ్య గెలిచారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది.