గురుకులంలో క్రమశిక్షణ పేరుతో జూనియర్లను కొట్టిన సీనియర్లు

గురుకులంలో క్రమశిక్షణ పేరుతో జూనియర్లను కొట్టిన సీనియర్లు

రాయికల్, వెలుగు:  జగిత్యాల జిల్లా రాయికల్​మండలం అల్లీపూర్​ గురుకులంలో సీనియర్​క్లాస్ ​లీడర్లు జూనియర్​ స్టూడెంట్స్​ను క్రమశిక్షణ పేరిట చితకబాదడంతో ఐదుగురు గాయపడ్డారు. ఉగాది సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు రాగా విషయం బయటపడింది. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. అల్లీపూర్(సింగరావుపేట) గ్రామంలోని మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల పాఠశాలకు మంగళవారం ఉగాది సెలవు ఉండడంతో.. సోమవారం సాయంత్రం ప్రిన్సిపాల్​ ఓ మహిళ టీచర్​కు పిల్లలను చూసుకునే బాధ్యత అప్పగించారు. ఆమె 9వ, 7వ తరగతుల్లోని క్లాస్​, స్కూల్ ​లీడర్స్ తో ​కింది తరగతుల స్టూడెంట్స్​ను క్రమశిక్షణలో పెట్టాలని చెప్పింది. దీంతో సోమవారం రాత్రి చెప్పినట్టు వినడం లేదని ఆరో తరగతి చదివే స్టూడెంట్​ను ఏడో తరగతి క్లాస్ ​లీడర్ ​కొట్టాడు. 

మంగళవారం ఉదయం ఏడో తరగతి చదివే నలుగురు విద్యార్థులను తొమ్మిదో తరగతి క్లాస్​ లీడర్ ​కొట్టాడు. కొట్టిన విషయం ఎవరికైనా చెప్తే మళ్లీ దెబ్బలు తప్పవని బెదిరించడంతో పిల్లలు సైలెంట్ ​అయిపోయారు. ఉగాది సందర్భంగా తమ పిల్లలను చూసేందుకు  స్కూల్​కు వచ్చిన పేరెంట్స్ ​గాయాలతో ఉన్న వారిని చూసి ఏమైందని అడిగారు. వారు జరిగిందంతా చెప్పడంతో ప్రిన్సిపాల్​కు కంప్లయింట్​చేయడానికి వెళ్లబోయారు. ఆయన లేరని చెప్పడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. అధికారుల పర్యవేక్షణ లేదని, టీచర్లు, స్టాఫ్​ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సరిపడా టాయిలెట్స్​లేవని, మరుగుదొడ్లకు తలుపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా గాయపడ్డ విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్​ వెంకటరమణ గురుకులం వద్దకు చేరుకోగా ఆయనను తల్లిదండ్రులు నిలదీశారు. ట్రాఫిక్ ​స్తంభించిపోవడంతో ఎస్ఐ అజయ్​ వచ్చి వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. బాధిత విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ప్రిన్సిపాల్​ మాట్లాడుతూ బుధవారం తల్లిదండ్రులతో మీటింగ్​ఏర్పాటు చేస్తామని, ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోలీసులు సీనియర్ ​విద్యార్థులకు కౌన్సెలింగ్​ ఇచ్చారు.