బీఆర్ఎస్ హయాంలో మా బతుకులు .. చెప్రాసీల కన్నా అధ్వానం!

బీఆర్ఎస్ హయాంలో మా బతుకులు ..  చెప్రాసీల కన్నా అధ్వానం!
  • నాటి కాంగ్రెస్​ హయాంలో రాజుల్లా బతికినం
  • మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నరు
  • గద్వాల సెగ్మెంట్​ రివ్యూలో ఎంపీపీలు, మున్సిపల్  చైర్మన్  సంచలన ఆరోపణలు

గద్వాల, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీల బతుకులు చెప్రాసీల కన్నా అధ్వానంగా మారాయని మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సమక్షంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్​ కేశవ్​ సంచలన ఆరోపణలు చేశారు.‘మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తోపాటు, ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న మీరు (శ్రీనివాస్ గౌడ్) కూడా గద్వాల అభివృద్ధిని అడ్డుకొని అన్యాయం చేశారు’ అంటూ గట్టు ఎంపీపీ విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్​నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్​ గద్వాల సెగ్మెంట్ రివ్యూ మీటింగ్​ను సోమవారం గద్వాలలోని ఆ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్.. బీఆర్ఎస్​ ప్రభుత్వం తీరుపైనా, అప్పటి మంత్రుల వ్యవహారశైలిపైన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. 

గద్వాల మున్సిపల్​ చైర్మన్​ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ.. 2005 నుంచి 2010 వరకు తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజులాగా పనులు చేయించేవాడినన్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో తాను మున్సిపల్ చైర్మన్​గా ఉండి ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేకపోయానని వాపోయారు. కానీ, గద్వాల నియోజకవర్గ కార్యకర్తలమంతా సమిష్టిగా పనిచేసి, మళ్లీ కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించుకున్నా మన్నారు. కార్యకర్తలే పట్టుకొమ్మలు అని చెప్పే బీఆ ర్ఎస్​ హైకమాండ్​ ఏనాడూ  కార్యకర్తలను పట్టించు కోలేదని మండిపడ్డారు. గట్టు ఎంపీపీ విజయకుమార్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ గద్వాలకు అన్యాయం చేశారని విమర్శించారు. మీరు వచ్చి ఓపెనింగ్ చేస్తారని లక్షలు ఖర్చు పెట్టి  గట్టు మండలంలో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటే రాలేదన్నారు.  ఇద్దరు మంత్రులు గద్వాలకు అన్యా యం చేసినా,  కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేయకపోయినా కష్టపడి ఆయనను ఎమ్మెల్యేను చేశామన్నారు. 

 సమన్వయలోపం వల్లే జరిగింది.. సరిదిద్దుతా..

కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ.. పార్టీకి , ప్రజలకు మధ్య  సమన్వయం లోపించి బీఆర్ఎస్​ ఓడిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  60 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేని అభివృద్ధిని పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిందన్నారు. కానీ, చేసిన పనులను చెప్పుకోలేక ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కోరారు. అనంతరం 2019 నుంచి 2024 వరకు సర్పంచులుగా ఉన్న వారికి సన్మానం చేశారు.