
ముంబై: బెంచ్‌మార్క్ సెన్సెక్స్ మొదటిసారి చారిత్రాత్మక 78,000 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ మంగళవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. బ్లూచిప్ బ్యాంక్ స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భారీ కొనుగోళ్లతో 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 712.44 పాయింట్లు పెరిగి 78,053.52 వద్ద కొత్త ముగింపు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంట్రాడేలో 823.63 పాయింట్లు పెరిగి 78,164.71 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జూన్ 10న సెన్సెక్స్ తొలిసారిగా 77,000 మార్క్‌ను అధిగమించింది. నిఫ్టీ 183.45 పాయింట్లు పెరిగి తాజా రికార్డు గరిష్ట స్థాయి 23,721.30 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో ఇది 216.3 పాయింట్లు పెరిగి ఇంట్రా-డే జీవితకాల గరిష్ఠ స్థాయి 23,754.15ను తాకింది. 30 సెన్సెక్స్ కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడ్డాయి. అయితే, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే, మారుతీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వెనుకబడి ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.26 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.03 శాతం తగ్గింది.
సూచీల్లో కొన్నింటికే లాభాలు
సూచీలలో బ్యాంకెక్స్ 1.87 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.45 శాతం, ఐటీ 0.53 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.28 శాతం, టెక్ 0.43 శాతం చొప్పున ఎగిశాయి. రియల్టీ 1.82 శాతం, పవర్ 1.05 శాతం, యుటిలిటీస్ 0.95 శాతం, మెటల్ 0.84 శాతం, టెలికమ్యూనికేషన్ 0.28 శాతం కూడా పడిపోయాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, షాంఘై నష్టపోయింది. యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.44 శాతం క్షీణించి 85.63 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ. 653.97 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.