ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు బుధవారం తమ ఓపెనింగ్ లాభాలను కోల్పోయి నష్టాల్లో క్లోజయ్యాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు నెగెటివ్‌లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు కూడా బుధవారం లాభాల్లో ఓపెన్ అయ్యాయి. కానీ, హయ్యర్ లెవెల్‌లో నిలవలేకపోయాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు (0.53 శాతం) తగ్గి 57,685 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 70 పాయింట్లు (0.4 శాతం) నష్టపోయి 17,246 పాయింట్ల వద్ద ముగిసింది. ‘మార్కెట్‌లు గత కొన్ని సెషన్ల నుంచి ఒక రేంజ్ బౌండ్‌లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ఓపెన్ అయినప్పటికీ, హయ్యర్ లెవెల్స్ దగ్గర పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. దీంతో మధ్యాహ్నం సెషన్‌లో ఇండెక్స్‌లపై డౌన్‌సైడ్ ప్రెజర్ పెరిగింది’ అని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ ఖేమ్కా పేర్కొన్నారు. గత కొన్ని సెషన్లలో మార్కెట్ పెరిగిందని, దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. సప్లయ్ చెయిన్ సమస్యలతో గ్లోబల్‌గా ఇన్‌ఫ్లేషన్ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇన్‌ఫుట్ కాస్ట్ పెరుగుతుండడం, కొన్ని దేశాల్లో కరోనా కేసులు ఎక్కువవుతుండడం, యుద్ధం, కమోడిటీ ధరలు పెరగడం వంటివి కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతాయని, వీటి గ్రోత్ తగ్గొచ్చని అన్నారు. గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇండెక్స్‌లు కన్సాలిడేట్ అవ్వడం చూశామని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్‌గా అనిశ్చితి పరిస్థితులు, దేశీయంగా కూడా మార్కెట్‌ను పెంచే అంశాలు ఏవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని అభిప్రాయపడ్డారు. సెక్టార్ల పరంగా చూస్తే, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఇండస్ట్రీయల్స్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి. టోక్యో, హాంకాంగ్, సియోల్, షాంఘై మార్కెట్లు లాభాల్లో క్లోజయ్యాయి. యూరప్‌లోని మెజార్టీ స్టాక్ ఎక్స్చేంజిలు లాభాల్లో ముగిశాయి.
