నష్టాల నుంచి లాభాల్లోకి..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

నష్టాల నుంచి లాభాల్లోకి..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
  • ట్రంప్ టారిఫ్‌‌లతో తీవ్ర ఒడిదుడుకుల్లో కదిలిన మార్కెట్‌‌
  • ఇంట్రాడేలో ఒక శాతం నష్టం నుంచి అర శాతం లాభంలోకి వచ్చిన సెన్సెక్స్‌‌
  • చివరికి 296 పాయింట్ల లాస్‌‌తో ముగింపు
  •  సేఫ్‌‌గా ఎఫ్‌‌ఎంసీజీ

ముంబై: బెంచ్‌‌మార్క్‌‌ ఇండెక్స్‌‌లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం తీవ్ర ఒడిదుడుకుల్లో కదిలాయి.  యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 1 నుంచి భారత ఎగుమతులపై 25శాతం టారిఫ్, అదనంగా  పెనాల్టీ వేస్తామని ప్రకటించడంతో మార్కెట్లు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి.  కానీ, ఇంట్రాడేలో నష్టాలను తగ్గించుకోవడమే కాకుండా,  అర శాతం లాభపడ్డాయి.  చివరికి నష్టాల్లోనే  సెషన్‌‌ను ముగించాయి. సెన్సెక్స్‌‌ ఉదయం  786.71 పాయింట్లు (0.96శాతం) పడిపోయి 80,695.15కు చేరగా, మధ్యాహ్నం కొంత కోలుకుంది. కానీ, సెషన్ ముగింపులో అమ్మకాల ఒత్తిడి మళ్లీ పెరిగింది. చివరికి  296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద ముగిసింది. బీఎస్‌‌ఈలో  2,418 స్టాక్స్ క్షీణించగా, 1,598 లాభపడ్డాయి. 137 స్థిరంగా ఉన్నాయి.  ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 86.70 పాయింట్లు (0.35శాతం) తగ్గి 24,768.35 వద్ద  క్లోజయ్యింది.

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

జియోజిత్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, టారిఫ్ బెదిరింపులతో మార్కెట్ నష్టాల్లో  ప్రారంభమైందని,   స్వల్ప నష్టాలతో ముగిసిందని తెలిపారు. ‘‘ఎఫ్‌‌ఎంసీజీ రంగం ఆకర్షణీయ వాల్యుయేషన్స్, డిమాండ్ ఔట్‌‌లుక్, టారిఫ్ రిస్క్‌‌ల నుంచి రక్షణ కారణంగా పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఆయిల్ అండ్  గ్యాస్ రంగం రష్యన్ ఆయిల్ దిగుమతులపై యూఎస్‌‌ హెచ్చరికలతో అత్యధికంగా నష్టపోయింది”అని అన్నారు. కాగా,  ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో ఇండియాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్  ఈ ప్రకటన చేశారని ఎనలిస్టులు భావిస్తున్నారు.  

ఇటీవల జపాన్, యూకే, ఈయూతో అమెరికా తనకు అనుకూలమైన ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంది. సెన్సెక్స్‌‌లో టాటా స్టీల్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎన్‌‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా నష్టపోయాయి.   హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌‌యూఎల్‌‌) 3.48శాతం పెరిగింది. ఈ ఏడాది  జూన్ క్వార్టర్‌‌‌‌లో  కంపెనీ నికర లాభం 5.97శాతం వృద్ధి చెంది రూ.2,768 కోట్లకు చేరడమే కారణం. ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కూడా లాభపడ్డాయి.  టారిఫ్ ప్రకటనతో మార్కెట్ ఒడిదొడుకులకు గురై, హెవీవెయిట్ స్టాక్స్‌‌లో కొనుగోలు జరగడంతో నష్టాలు తగ్గించుకుందని రెలిగేర్ బ్రోకింగ్ ఎస్‌‌వీపీ అజిత్ మిశ్రా అన్నారు. 

టెలికం, ఆయిల్‌‌ షేర్ల పతనం 

సెక్టోరల్‌‌గా చూస్తే,  బీఎస్‌‌ఈలో టెలికమ్యూనికేషన్ (1.80శాతం), ఆయిల్ అండ్‌‌  గ్యాస్ (1.47శాతం), ఎనర్జీ (1.40శాతం), మెటల్ (1.18శాతం), కమొడిటీస్ (1.03శాతం), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (0.78శాతం) ఎక్కువగా పడ్డాయి.  ఎఫ్‌‌ఎంసీజీ, సర్వీసెస్ రంగాలు లాభపడ్డాయి. స్మాల్‌‌క్యాప్ 0.85శాతం, మిడ్‌‌క్యాప్ 0.70శాతం తగ్గాయి. ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పీ, షాంఘై ఎస్ఎస్‌‌ఈ, హాంగ్‌‌కాంగ్ హాంగ్‌‌సెంగ్ క్షీణించగా, జపాన్ నిక్కీ 225 లాభపడింది. యూరప్, యూఎస్‌‌ మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి.  బ్రెంట్ క్రూడ్ 0.74శాతం తగ్గి బ్యారెల్‌‌కు 72.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) బుధవారం నికరంగా రూ.850.04 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, గురువారం సెషన్‌‌లో మరో రూ.5,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.  బుధవారం సెషన్‌‌లో సెన్సెక్స్ 143.91 పాయింట్లు (0.18శాతం), నిఫ్టీ 33.95 పాయింట్లు (0.14శాతం) పెరిగాయి.

ఐదు నెలల కనిష్టానికి రూపాయి విలువ.. 

ట్రంప్ టారిఫ్‌‌ల దెబ్బకు డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఐదు నెలల కనిష్టానికి పడింది. 87.56 లెవెల్‌‌ వరకు క్షీణించింది.  డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది ఫిబ్రవరిలో 87.95 దగ్గర ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.